వైద్య విద్య ఉన్నతమైనది
పీసిమ్స్ ఫ్రెషర్స్ డే వేడుకల్లో మంత్రి సత్యకుమార్ యాదవ్
గన్నవరం రూరల్: వైద్య విద్య ఉన్నతమైందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. సోమవారం రాత్రి మండలంలోని చిన అవుటపల్లి డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాల 2025 ఫ్రెషర్స్‌డే వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డాక్టర్స్ సుధా అండ్ నాగేశ్వరరావు టెలి మెడిసిన్ హాల్‌లో ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవీ భీమేశ్వర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంబీబీఎస్ విద్యార్థులకు నిర్వహించిన వైట్ కోట్ సెర్మనీలో తెల్ల కోట్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంబీబీఎస్ చదివే అదృష్టం కొందరికే దక్కుతుందన్నారు. సేవా భావం, నైతిక విలువలు, చదువు, వృత్తి పట్ల అంకిత భావం ఉన్నత స్థానానికి తీసుకువెళతాయని విద్యార్థులకు సూచించారు. కళాశాల డైరెక్టర్ జనరల్ డాక్టర్ చదలవాడ నాగేశ్వరరావు మాట్లాడుతూ వైద్య విద్య చదివేందుకు చేరిన విద్యార్థులు ఉత్తమ లక్ష్యంతో ప్రపంచం మెచ్చే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. సిద్ధార్థ అకాడమీ అధ్యక్షుడు మలినేని రాజయ్య, కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు, కోశాధికారి సూరెడ్డి వెంకటేశ్వరరావు, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి.అనిల్‌కుమార్ పాల్గొన్నారు.


