పోలీస్ గ్రీవెన్స్‌కు 79 ఫిర్యాదులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్ గ్రీవెన్స్ కార్యక్రమంలో 79 ఫిర్యాదులు అందాయి. పోలీసు కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఎస్‌వీడి ప్రసాద్, ఏడీసీపీ ఎం.రాజారావు ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకున్నారు. ఈ సందర్భంగా నడవలేని వృద్ధులు, వికలాంగుల వద్దకే వెళ్లి ఫిర్యాదులు తీసుకుని వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత స్టేషన్‌ల ఎస్‌హెచ్‌ఓలతో మాట్లాడి సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదులో భూమి, ఆస్తి వివాదాలు, నగదు లావాదేవీలపై 38, భార్యాభర్తలు, కుటుంబ కలహాలపై 5, కొట్లాటకు సంబంధించి 1, వివిధ మోసాలపై 16, మహిళా సంబంధిత నేరాలపై 5, దొంగతనాలపై 3, ఇతర చిన్న వివాదాలు, సమస్యలపై 11 ఇలా మొత్తం 79 ఫిర్యాదులు అందాయి.


