కారు ఢీకొని సెక్యూరిటీ గార్డ్ దుర్మరణం
కృష్ణలంక(విజయవాడతూర్పు): గుర్తు తెలియని కారు ఢీకొని ఓ సెక్యూరిటీ గార్డ్ దుర్మరణం చెందిన ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు రాణిగారితోట, 18వ డివిజన్‌లోని తమ్మిన పోతురాజు వీధిలో ఓర్సు వెంకటస్వామి(56) కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఈయనకు భార్య, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. అతను బందరు రోడ్డులోని ఒక జ్యూయలరీ షాపులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆదివారం స్నేహితుని పని మీద రాత్రి 9గంటలకు బందరురోడ్డు వైపు వెళ్లాడు. రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి తిరిగి వెళుతూ నేతాజీ వంతెన వద్ద సాయిబాబా గుడి వైపు నుంచి రాణిగారితోట వైపునకు జాతీయ రహదారి దాటుతున్న సమయంలో బెంజిసర్కిల్ వైపు నుంచి వారధి వైపు అతి వేగంగా వెళ్తున్న గుర్తు తెలియని కారు అతనిని బలంగా ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో అతను తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. సమా చారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీ సులు వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని కుమారుడు అభిషేక్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


