11 నుంచి భవానీ దీక్షల విరమణ
భవానీపురం(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో డిసెంబర్ 11 నుంచి 15వ తేదీ వరకు భవానీ దీక్షల విరమణ జరుగుతుందని ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె.శీనానాయక్ తెలిపారు. శనివారం తన చాంబర్‌లో దుర్గగుడి ఉద్యోగులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ.. దీక్షల విరమణ 11వ తేదీ ఉదయం ఆరు గంటలకు ప్రారంభమై 15వ తేదీ ఉదయం 10.30 గంటలకు మహా పూర్ణాహుతితో ముగుస్తుందని తెలిపారు. ఈ ఐదు రోజులపాటు దాదాపు ఏడు లక్షల మందికిపైగా భవానీ భక్తులు దీక్ష విరమణకు ఇంద్రకీలాద్రికి తరలి వస్తారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అగ్ని ప్రతిష్టాపన, శత చండీయాగం, గిరి ప్రదక్షిణ వంటి ప్రధాన క్రతువులు జరుగుతాయని వివరించారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా ప్రత్యేక క్యూలైన్లు, వెయిటింగ్ హాళ్లు, పార్కింగ్ ప్రదేశాలు, ప్రసాదం, అన్నదానం పంపిణీ కౌంటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు, బందో బస్తు ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. భవానీ దీక్షల విరమణ సందర్భంగా డిసెంబర్ 11 నుంచి 16వ తేదీ వరకు అన్ని ఆర్జిత సేవలను తాత్కాలికంగా రద్దు చేసి ఏకాంతంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. డిసెంబర్ నాలుగో తేదీన కలశజ్యోతి మహోత్సవం జరుగుతుందని తెలిపారు.


