పనులను రద్దు చేసే అధికారం సీఈఓకు లేదు
జెడ్పీ సర్వసభ్య సమావేశంలో సభ్యుల ఆమోదంతో తీర్మానం చేసి కేటాయించిన పనులను రద్దు చేసే అధికారం సీఈఓకు లేదని ఎమ్మెల్సీ మొండితోక అరుణకుమార్ స్పష్టంచేశారు. సమావేశానికి హాజరైన ఆయన సభ్యుల ఆవేదనను చూసిన అధికారు లతో మాట్లాడారు. చైర్‌పర్సన్, జెడ్పీటీసీ సభ్యుల సమన్వయంతో నడవాల్సిన సీఈఓ ఏకపక్షంగా వ్యవహరించడం భావ్యం కాదన్నారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే జెడ్పీ సర్వసభ్య, స్థాయీ సంఘ సమావేశాలు ఎందుకని ప్రశ్నించారు. ఒకసారి పరి పాలన అనుమతులు ఇచ్చాక లోటు బడ్జెట్ ఉన్నప్పటికి రాబోయే నిధుల నుంచి పనులకు బిల్లులు చెల్లించాలని సూచించారు. జెడ్పీ నిధులపై సభ్యులకు అధికారం ఉందా? లేదా? అని నిలదీశారు. సమావేశంలో తీర్మానం చేయడం అంటే అది ఒక హామీ లాంటిదని, దానిని సీఈఓ అవహేళన చేశా రని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కేటాయించిన 424 పనుల్లో ఇప్పటి వరకు 50 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులను వచ్చే నిధులతో చేపట్టకుండా, ఎమ్మెల్యే లేఖల సిఫార్సులతో నిధులు మళ్లించడాన్ని తప్పుబడ్డారు.


