చిన్నారుల పెదవులపై చిరునవ్వులు!
నిరంతరం వైద్య సేవలు
వేదన తొలగించే మహోన్నత కార్యక్రమం
గన్నవరం రూరల్: చిన్నారుల్లో గ్రహణం మొర్రి, అంగిలి చీలిక, చీలు పెదవి ఇవన్నీ తల్లిదండ్రులను మానసిక క్షోభకు గురి చేస్తాయి. బిడ్డల జీవితంపై ప్రభావితం చూపుతాయి. దీంతో బిడ్డ పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రులు వేదనతో కుంగిపోతారు. అయితే ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతోంది. ఆపరేషన్ స్మైల్ ప్రోగ్రాం. పైపెదవిలో ఏర్పడే చీలికను గ్రహణం మొర్రి లేదా చీలిక పెదవి అంటారు. ఇది తల్లి గర్భంలోనే ఏర్పడుతుందని, బిడ్డకు పుట్టుకతోనే వస్తుందని వైద్యులు చెబుతున్నారు. జన్యు లోపాలు, కణజాలం అభివృద్ధిలో సమస్యలు కారణంగా చీలిక పెదవి ఏర్పడుతుందని వైద్యులు అంటున్నారు. ఈ సమస్యలకు ఆపరేషన్ స్మైల్ పరిష్కార వేదికగా నిలుస్తోంది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిన అవుటపల్లి డాక్టర్ పిన్నమనేని సిద్ధార్ధ మెడికల్ కళాశాలలో ఉచితంగా ఆపరేషన్‌లు చేసి గ్రహణం మొర్రి పెదవులపై చిరునవ్వులు పూయిస్తున్నారు. 2002 నుంచి మొదలైన ఈ కార్యక్రమం ఇప్పటికీ 18వ విడత ఆపరేషన్‌లతో కొనసాగుతుంది. 40దేశాలకు చెందిన నిపుణులైన 43 మంది వైద్య బృందం సేవల్లో పాల్గొంటుంది. వీరిలో నలుగురు సర్జన్‌లు, నర్సులు, మెడికల్ సిబ్బంది, డెంటిస్ట్‌లు, పీడియాట్రిక్ నిపుణులు సేవలందిస్తున్నారు. ఈ నెల 30వ తేదీ వరకూ ఉచిత ఆపరేషన్‌ల వైద్య శిబిరం కొనసాగుతుందని డాక్టర్ పిన్నమనేని సిద్ధార్ధ మెడికల్ కళాశాల బోధనాస్పత్రి ఏవో కె.నవీన్ చెప్పారు. జన్యుపరమైన లోపాలు, కణజాలం అభివృద్ధిలో సమస్యలు, పొగతాగే కుటుంబాల్లో, కట్టెల పొయ్యిపై వంటలు చేసే కుటుంబాల్లో పొగ వల్ల, తల్లులలో న్యూట్రీషన్ లోపాలు, గర్భస్థ సమయంలో మందులు సరిగా వాడకపోవటం వంటి కారణాలు ప్రధానంగా ఈ గ్రహణం మొర్రికి కారణమవుతాయని నిపుణులు చెప్పారు.
రెండు రాష్ట్రాల నుంచి వచ్చిన గ్రహణం మొర్రి రోగులు..
శ్రీకాకుళం మొదలుకుని చిత్తూరు వరకూ, మరోవైపు తెలంగాణ జిల్లాల నుంచి ఆపరేషన్‌లు చేయించేందుకై తమ బిడ్డలను తీసుకుని తల్లిదండ్రులు డాక్టర్ పిన్నమనేని సిద్ధార్ధ ఆస్పత్రికి వచ్చారు. వీరందరికీ ఆస్పత్రి యాజమాన్యం వసతి, భోజనాలు ఉచితంగా ఏర్పాటు చేసింది. మెడికల్ కళా శాల డాక్టర్‌లు తల్లిదండ్రులను, గ్రహణం మొర్రి బాలలకు అవగాహన కల్పిస్తూ వారిలో మనోధైర్యాన్ని పెంపొందిస్తున్నారు. ఈ నెల 23న ప్రారంభమైన ఆపరేషన్‌లు రోజుకు 15 చొప్పున చేస్తున్నట్లు వైద్య బృందం సాక్షికి తెలిపింది. మొత్తం 70 సర్జరీలు లక్ష్యంగా పని చేస్తున్నట్లు వెల్లడించారు.
ఉన్నత ప్రమాణాలతో వైద్యం...
డాక్టర్ పిన్నమనేని సిద్ధార్ధ మెడికల్ కళాశాల, భోధన ఆస్పత్రి పార్టనర్ షిప్‌తో బెంగళూరుకు చెందిన డాక్టర్ సందీప్ రాల్సన్ సర్జరీ టీమ్ లీడర్‌గా విదేశీ వైద్య బృందం ఉన్నత ప్రమాణాలతో ఉత్తమ వైద్యం అందిస్తోంది. విదేశీ వైద్య బృందం ప్రతినిధులు మాట్లాడుతూ డాక్టర్ పిన్నమనేని సిద్ధార్ధ వైద్య కళాశాల డైరెక్టర్ జనరల్ డాక్టర్ చదలవాడ నాగేశ్వరరావు సంపూర్ణ సహకారంతో 18వ విడత ఈ ఆపరేషన్‌లు చేయడానికి తమకు బలాన్నిచ్చిందని చెప్పారు. ఆపరేషన్ థియేటర్‌లు, వసతి, నర్సింగ్ కేర్, వైద్యుల సహకారం, పరిపాలన అధికారుల మద్దతు కొండంత అండగా నిలిచాయన్నారు. వారి పార్టనర్ షిప్‌తో ఇప్పటికీ 1800 ఆపరేషన్‌లు దిగ్విజయంగా నిర్వహించారన్నారు.
ఇది ఒక నిరంతర స్రవంతి అని చెప్పారు. గ్రహణం మొర్రి, అంగిలి చీలిక, చీలి పెదవి ముఖాలపై చిరునవ్వుల వెలుగులు ఆపరేషన్ స్మైల్ లక్ష్యమన్నారు. బాలలతో విదేశీ వైద్య బృందం ప్రతినిధులు మమేకమై ఆటపాటలు, డ్యాన్స్‌లు చేస్తూ, చిన్న బిడ్డలను లాలిస్తూ వైద్య సేవలు కొనసాగిస్తున్నారు. తెలంగాణా రాష్ట్రంలోని కొత్తగూడెం, భద్రాద్రి, ఇతర ప్రాంతాల నుండి వచ్చిన తల్లిదండ్రులు ఇక్కడ వైద్యం చేయించుకుంటున్నారు. మరింత మందికి ఈ సమాచారం తెలియాలని, వారందరికీ ఆపరేషన్ స్మైల్ ద్వారా సేవలందించి వారిలో ఉన్న ఆత్మన్యూనతను తొలగించి వారిని సమాజంలో ఉన్నత స్థానంలో నిలపటమే లక్ష్యమన్నారు.
ఆపరేషన్ స్మైల్ అందించే సేవలు ఎంతో గొప్పవి. గ్రహణం మొర్రితో పుట్టిన బిడ్డల తల్లిదండ్రుల వేదనను తొలగించే మహత్తర కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆ బిడ్డలు ఆత్మన్యూనతలోకి వెళ్లకుండా బాల్యంలోనే సమస్య తొలగిస్తున్నారు. ఈ యజ్ఞంలో భాగస్వాములు కావటం అదృష్టంగా భావిస్తున్నాము. రెండు రాష్ట్రాల నుంచి రోగులు వచ్చి వైద్యం చేయించుకుంటున్నారు. విదేశీ వైద్య బృందం ఈ సేవలలో పాల్గొనడం ద్వారా ప్రతి ఒక్కరికీ సేవా భావం ఉండాలన్న గొప్ప సందేశాన్ని ఇస్తున్నారు. ఆపరేషన్ స్మైల్ స్పూర్తిని అందరం స్వీకరించాలి. –డాక్టర్ చదలవాడ నాగేశ్వరరావు,
పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాల డైరెక్టర్ జనరల్
ఆపరేషన్ స్మైల్‌తో గ్రహణం మొర్రికి శాశ్వత పరిష్కారం
తల్లిదండ్రుల వేదనకు స్వస్తి
డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాలలో 43 మంది విదేశీ వైద్య బృందంతో సేవలు
ఆంధ్రా, తెలంగాణ నుంచి వచ్చిన రోగులకు ఉచిత ఆపరేషన్‌లు
చిన్నారుల పెదవులపై చిరునవ్వులు!
చిన్నారుల పెదవులపై చిరునవ్వులు!


