అతివేగానికి రెండు ప్రాణాలు బలి
●జాతీయ రహదారిపై డివైడరును ఢీకొన్న బైక్
● ఇద్దరు దుర్మరణం
కంకిపాడు: అతి వేగం రెండు నిండు ప్రాణాలను బలిగొంది. బైక్ డివైడరును ఢీకొనటంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. విజయవాడ–మచిలీపట్నం జాతీయరహదారిపై శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. కంకిపాడు మండలం కోలవెన్ను శివారు కోమటిగుంటలాకులకు చెందిన సందోలు నరసింహులు (45), ఉయ్యూరుకు చెందిన పచ్చిగళ్ల దానియేలు (25) బంధువులు. శుక్రవారం నరసింహులు ఉయ్యూరు వెళ్లి బంధువులను కలిశాడు. రాత్రి పొద్దుపోయిన తరువాత తనను స్వగ్రాౖమమైన కోమటిగుంట లాకులు వద్ద దింపాలని కోరటంతో పచ్చిగళ్ల దానియేలు బైక్‌పై నరసింహులును దించేందుకు బయలుదేరాడు. వీరి బైక్ నెప్పల్లి సెంటరు దాటిన తరువాత ప్రమాదానికి గురైంది. జాతీయ రహదారి మధ్యన ఉన్న డివైడరును ఢీకొన్న బైక్ వేగంగా డివైడరు మధ్యన ఉన్న చెట్లను ఢీకొన్నట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రమాదంలో నరసింహులు, దానియేలు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సీఐ జె.మురళీకృష్ణ, ఎస్‌ఐ డి.సందీప్, అదనపు ఎస్‌ఐ తాతాచార్యులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రెండు మృతదేహాలు రోడ్డు మధ్యన పడి ఉండటాన్ని ఉదయం వరకూ ఎవరూ గుర్తించలేదు. కనీసం 108కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది కూడా శనివారం ఉదయం 8 గంటల తరువాతే. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు సైతం అదే సమయంలో ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
నందిగామ టౌన్:పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపం పక్కనున్న అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న ఓ వ్యక్తి ఐదవ అంతస్తు నుంచి కిందకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం చోటుచేసుకుంది. చందర్లపాడు మండలం ఏటూరు గ్రామానికి చెందిన దున్న వెంకట్రావ్ (54) గత కొంత కాలంగా పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపం పక్కనున్న అపార్ట్‌మెంట్‌లోని ఐదో అంతస్తులో అద్దెకుంటున్నాడు. ఈయన టైలర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో ఉదయం సమయంలో కిందకు దూకటంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్య నిమిత్తం విజయవాడ తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య వివరాలు తెలియాల్సి ఉంది.


