ఉపాధి విభాగాధిపతుల పాత్ర కీలకం
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు):యువతను ఉద్యోగ సనద్థులుగా చేయడంలో కళాశాల ఉపాధి విభాగాధిపతుల పాత్ర చాలా కీలకమని కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కళాశాలల శిక్షణ ఉపాధి విభాగాధిపతుల సమాఖ్య, సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలల ఉపాధి విభాగాధిపతుల శిక్షణ కార్యక్రమం (ప్లేస్మెంటర్–2025) సిద్ధార్థ కళాశాల ఆవరణలోని వెబ్‌నార్ హాలులో శనివారం జరిగింది. వాసంశెట్టి సుభాష్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గూగుల్, రిలయన్స్, టీసీఎస్, కాగ్నిజెంట్, ఎక్సెంచ్యూర్ వంటి దిగ్గజ కార్పొరేట్ సంస్థలు మన రాష్ట్రంలో ఆయా సంస్థల శాఖలను ప్రారంభిస్తున్నాయని చెప్పారు. ఇలాంటి తరుణంలో కళాశాలల నుంచి లక్షల సంఖ్యలో బయటికి వస్తున్న పట్టభద్రులు, యువతను ఉద్యోగ సన్నద్థులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధి విభాగాధిపతులపైనే ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఎస్.ఎస్. కన్వెన్షన్ లో డిసెంబర్ 12,13,14 తేదీల్లో నిర్వహిస్తున్న బిజినెస్ ఎక్స్‌పో పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు. ఐటీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు అన్నే ఇంద్రజిత్, ఇన్ఫోసిస్ విశాఖపట్టణం సెంటర్ హెడ్ నర్రా సురేష్, హెచ్‌సీఎల్ టెక్నాలజీ ప్రతినిధి బొర్రా సురేష్ బాబు మాట్లాడారు. సిద్ధార్థ కళాశాల డీన్ రాజేష్ సీ.జంపాల, ఆంధ్రప్రదేశ్ శిక్షణా ఉపాధి అధికారుల సమాఖ్య అధ్యక్షుడు డాక్టర్ ఎన్‌వీ సురేంద్ర బాబు, కార్యదర్శి జగదీష్, సంయుక్త కార్యదర్శులు కావూరి శ్రీధర్, హిమబిందు, సభ్యుడు శివ నాగేశ్వరరావు తదితరులున్నారు.
కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్


