హామీల అమలుకు డిమాండ్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్నికల ప్రచారం, యువగళం పాదయాత్రలోనూ రాష్ట్రమంత్రి నారా లోకేష్ విద్యార్థులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య డిమాండ్ చేసింది. విజయవాడ అలంకార్ సెంటర్‌లోని ధర్నా చౌక్ నందు ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో శుక్రవారం పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జి.వలరాజు, బందెల నాసర్‌జీ మాట్లాడుతూ ఇచ్చిన హామీలను అమలుచేయకుండా మంత్రి లోకేష్ విద్యార్థులను మోసం చేస్తున్నారన్నారు. తన చేతగానితనంతో విద్యార్థుల భవిష్యత్‌ను నాశనం చేస్తున్నారని విమర్శించారు. విద్యార్థుల సమస్యలపై ప్రశ్నిస్తుంటే విద్యాసంస్థల్లో రాజకీయ ప్రసంగాలు చేయకూడదంటున్న మంత్రి నారా లోకేష్, యువగళం పాదయాత్రలో విద్యార్థులతో రాజకీయం చేయలేదా? అని ప్రశ్నించారు. మంత్రి లోకేష్ తన ప్రాపకం పెంచుకునేందుకే విద్యార్థి సంఘాల నేతలతో చర్చించారని, హామీల అమలుపై ఆయనకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. జీవో నంబర్ 77ను రద్దు చేస్తామని, అందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తామని, మూసివేసిన పాఠశాలలను తెరిపిస్తామని హామీలు ఇచ్చారని, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించిన వైనాన్ని గుర్తుచేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే చలో అసెంబ్లీ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ధర్నా చౌక్ నుంచి బయటకు వస్తున్న విద్యార్థులను పోలీసులు నియంత్రించారు. ఆ సమయంలో పోలీసులు, విద్యార్థి సంఘ నాయకులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. విద్యార్థులు రోడ్డుపై భైఠాయించి నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ మస్తాన్ షరీఫ్, బండి చలపతి, నాగభూషణ్, నవ్య శ్రీ సాయికుమార్, రవికుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.కార్తీక్, హనుమంతు ప్రతాప్, నాగరాజు, శేషం మహేంద్ర, మాధవ్, ప్రవీణ్, బాబ్జి, రవి, తేజ, వెంకట్ యామిని, భవిత, షణ్ముఖ్ ప్రియ, భాను, మౌలిక, ప్రమొద తదితరులు పాల్గొన్నారు.


