చేనేత సమస్యలు పరిష్కరించని ప్రభుత్వం
కృష్ణలంక(విజయవాడతూర్పు): చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు పూర్తవుతున్నా చేనేత సమస్యలు పరిష్కరించలేదని, చేనేతలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేసిందని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ ఆరోపించారు. గవర్నర్‌పేట, రాఘవయ్య పార్కు సమీపంలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ చేనేత కార్మికులకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్, రూ.25వేలు పథకాన్ని అమలు చేయాలని, చేనేత సహకార సంఘాలకు ఇవ్వాల్సిన రూ.203 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హామీలు నెరవేర్చని పక్షంలో ఫిబ్రవరి 2026లో జరిగే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చలో అసెంబ్లీ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మురుగుడు సత్యనారాయణ, వృత్తి సంఘాల రాష్ట్ర కన్వీనర్ మన్నూరు భాస్కరయ్య తదితరులు పాల్గొన్నారు.


