ఒకే రోజు మూడు ఘటనలు..సైబర్ మోసాలతో జరభద్రం
లబ్బీపేట(విజయవాడతూర్పు): నగరంలోని విద్యుత్‌శాఖలో పనిచేసే ఇంజినీర్‌ను సైబర్ నేరగాళ్లు బెదిరించి రూ.34.65 లక్షలు కొట్టేశారు. అతని వద్ద డబ్బులు లేక పోతే పర్సనల్ లోన్ పెట్టించి మరీ తమ అకౌంట్స్‌కు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. వారు చెప్పే మాటలకు భయబ్రాంతులకు గురైన ఇంజినీర్ వేరే వారికీ చెప్పకుండా, వారు అడిగిన మొత్తం ఇచ్చేసిన తర్వాత మోసపోయినట్లు గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
బెంగళూరులో కేసు అని చెప్పి..
విద్యుత్‌శాఖలో ఇంజినీర్(38) ఎనికేపాడులో నివాసం ఉంటారు. అతనికి ఈ నెల 20న తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చింది. ‘మీ పేరున ఈ ఏడాది జూలై 2న బెంగుళూరులో సిమ్‌కార్డు రిజిస్ట్రేషన్ అయి ఉందని, ఆ నంబర్ నుంచి కొందరు మహిళల వీడియోలు, ఫొటోలు సర్క్యులేట్ అవడంతో బెంగళూరు అశోక్‌నగర్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైనట్లు తెలిపారు. కేసు నంబర్ సైతం తెలియజేసి రెండు గంటల్లో స్టేషన్‌లో ఉండాలన్నారు. దీంతో కంగుతిన్న ఇంజినీర్ తాను విజయవాడలో ఉంటానని చెప్పడంతో సరే లైన్‌లో ఉండూ అంటూ మరో నంబర్‌కు కలిపారు. అవతలి నుంచి మాట్లాడుతూ మీ ఆధార్ నంబర్ చెప్పమని అడిగారు. నంబర్ చెప్పగానే మీ పేరున ముంబైలో ఉమెన్‌ట్రాఫికింగ్, మనీ లాండరింగ్ కేసులు నమోదై ఉన్నట్లు చెప్పారు. వెంటనే అరెస్టు చేస్తామని బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. మీ ముంబైలో ఒక బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేశారు. దాని నుంచి రూ.3కోట్ల లావాదేవీలు కూడా చేశారంటూ డెబిట్ కార్డు కూడా ఉందని, దాని నుంచి ఉమెన్ ట్రాఫికింగ్‌లో మయన్మార్, కొలంబియా, ఫిలిప్పీన్స్‌కు విమాన టికెట్స్ కూడా బుక్ చేశారంటూ మరింత బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. ఆ తర్వాత నుంచి ప్రతి రెండు గంటలకు ఒకసారి 20, 21, 22 తేదీల్లో ఫోన్‌లు వస్తూనే ఉన్నాయి.
సీబీఐకి ట్రాన్స్‌ఫర్ అంటూ..
కాగా ఈ నెల 24న కేసు ఫైల్‌చేసి సీబీఐకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నామంటూ సీబీఐ ప్రొఫైల్ ఉన్న నంబర్‌తో వాట్సాప్ కాల్ చేశారు. మీ అకౌంట్ నుంచి రూ.3కోట్లు లావాదేవీలు జరిగినవి.. 10 శాతం కమీషన్ రూ.30 లక్షలు, ష్యూరిటీ రూ.65 లక్షలు డిపాజిట్ చేయాలని చెప్పారు. అంత డబ్బులు తన వద్ద లేవని చెప్పగా, ప్రభుత్వ ఉద్యోగివి కదా లోన్ తీసుకోమంటూ సలహా ఇచ్చారు. దీంతో ఎస్‌బీఐలో పర్సనల్ లోన్ తీసుకుని రూ.34.65లక్షలు వారు చెప్పిన అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.34.65 లక్షలు కొట్టేసిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అమృతంతో పాటు హాలాహలం పుట్టిందట! సౌకర్యాలెన్నో తెచ్చిన డిజిటల్ సాంకేతికత విసురుతోన్న తాజా సవాళ్లను చూస్తే అదే గుర్తొస్తోంది. రెచ్చిపోతున్న సైబర్ మోసగాళ్లు, పెచ్చుమీరుతోన్న డిజిటల్ స్కామ్‌లే అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ‘డిజిటల్ అరెస్ట్’బారినపడిన ఓ ఇంజినీర్ రూ. 34.65లక్షలు, రూపాయికి అర్దరూపాయి లాభం అంటూ సైబరాసురుడు విసిరిన వలకు పడిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రూ.7లక్షలు, స్టాక్ మార్కెట్ పేరుతో మరో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఏకంగా రూ. 43.51లక్షలు నష్టపోయిన ఉదంతాలు అమాయకుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. చదువుకున్న, ఉన్నత స్థాయి ఉద్యోగులే తమ కష్టార్జితాన్ని పోగోట్టుకోవడం చూస్తుంటే అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతోంది.


