బైక్ చోరీలు.. గంజాయి విక్రయాలు
వివిధ జిల్లాలకు చెందిన ఏడుగురు అరెస్ట్ 14 వాహనాలు, లక్ష విలువైన గంజాయి స్వాధీనం
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): వివిధ జిల్లాల్లో ద్విచక్ర వాహనాలను చోరీ చేసి, వాటితో గంజాయిని సేకరించి విక్రయిస్తున్న ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వన్‌టౌన్‌లోని సీసీఎస్ పోలీసుస్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో క్రైం ఏడీసీపీ ఎం. రాజారావు వివరించారు.
జల్సాల కోసం..
కృష్ణాజిల్లా పెనమలూరు మండలం తాడిగడప గ్రామానికి చెందిన గుడిసె భానుప్రకాష్(22) గతంలో కూలి పనులు చేసే వాడు. మద్యం ఇతర దురలవాట్లకు బానిసై వచ్చే ఆదాయం జల్సాలకు చాలక పోవడంతో సులభంగా డబ్బు సంపాదించి విలాసాలు చేయడానికి బైక్ దొంగతనాలను మార్గంగా ఎంచుకున్నాడు. దానికి అదే ప్రాంతానికి చెందిన మరో మైనర్ బాలుడితో కలిసి బ్యాంకులు, షాపింగ్ మాల్స్ వద్ద ఉన్న పార్కింగ్ ప్రదేశాలలో రెక్కీ నిర్వహిస్తూ అదను చూసుకుని పార్కింగ్ చేసిన మోటార్ సైకిల్స్‌ని దొంగిలిస్తున్నారు.
విజయవాడ టు ఏజెన్సీ
వయా కాకినాడ..
విజయవాడ, పెనమలూరు ఇతర జిల్లాల్లో దొంగిలించిన మోటార్ సైకిల్స్‌ని తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ కోట నండూరుకు చెందిన వడ్లమూరి గంగాధర్ (గంగు భాయ్, గంగు) అనే వ్యక్తికి వీరు అందిస్తారు. గంగుభాయ్ తనతోపాటు అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన మరొక నలుగురు వ్యక్తులు కొర్ర ఎలియా(రితిక్), గెమ్మిల్లి త్రినాథ్ (బత్తు), పొంగి శివ, పంతాల కొండబాబు (బాలరాజు, బాల)తో కలిసి ఏజెన్సీ ప్రాంతంలోకి వెళ్లి, మోటార్ సైకిళ్లు అక్కడ వారికి ఇచ్చి.. డబ్బులకు బదులుగా వారి వద్ద నుంచి గంజాయి తీసుకుని వస్తుంటారు. వీరందరూ కలిసి ఆ గంజాయిని విజయవాడ పరిసర ప్రాంతాలలో చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో విక్రయాలు చేస్తుంటారు.
పటమటలో అదుపులోకి..
ఈ ముఠా విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో మూడు, కృష్ణాజిల్లా పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు, విశాఖపట్నం నగర పోలీస్ కమిషనరేట్‌కు సంబంధించిన పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు, కాకినాడకు సంబంధించిన పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు, తెలంగాణకు సంబంధించిన పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు మొత్తం 14 మోటార్ సైకిళ్లను చోరీ చేశారు. వీటిపై విజయవాడ కమిషనర్ రాజశేఖర్‌బాబు ఆదేశాల మేరకు నిఘా ఉంచిన సీసీఎస్ పోలీసులు శుక్రవారం వారికి అందిన సమాచారం మేరకు పటమట ఆటోనగర్ ప్రాంతంలో ఆరుగురు వ్యక్తులను, ఒక మైనర్ బాలుడిని అదుపులోనికి తీసుకుని విచారించారు.
సిబ్బందికి అభినందన..
వారి వద్ద నుంచి 14 మోటార్ సైకిల్స్, ఐదు కిలోల గంజాయిని స్వాదీనం చేసుకుని వారిని అరెస్ట్ చేశారు. గంజాయి విలువ సుమారు లక్ష వరకూ ఉంటుందని, వాహనాల విలువ సుమారు రూ.12 లక్షలు ఉంటుందని ఏడీసీపీ తెలిపారు. ఈ సందర్భంగా మోటార్‌సైకిల్స్, గంజాయిని పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన సీసీఎస్ సీఐ పీ.శ్రీనివాసరావు, హెడ్ కానిస్టేబుల్స్ ఎం. సురేష్, ఎస్. వేణు గోపాల్, కానిస్టేబుల్స్ అప్పలరాజు, ఫణిరాజు పటమట పోలీసు సిబ్బంది ఏఎస్‌ఐ విజివిడి.ప్రసాద్, హెడ్ కానిస్టేబల్, ఎస్.కిషోర్‌బాబులను కమిషనర్ రాజశేఖర్‌బాబు అభినందించినట్లు ఏడీసీపీ రాజారావు వివరించారు.


