ఆక్స్‌ఫర్డ్ స్కూల్ ఘటనపై విద్యాశాఖ అధికారుల విచారణ
ఇబ్రహీంపట్నం: అయ్యప్ప దీక్షలో ఉన్న విద్యార్థిని కొట్టిన గుంటూరు ఆక్స్‌ఫర్డ్ పాఠశాలపై మండల విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు. ‘అయ్యప్ప దీక్షలో ఉన్న బాలికను కొట్టిన టీచర్’ అనే కథనం ‘సాక్షి’లో శుక్రవారం ప్రచురితమైంది. ఈ కథనానికి జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారావు స్పందించారు. ఆక్స్‌ఫర్డ్ స్కూల్‌పై విచారణ చేపట్టాలని మండల విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. డీఈఓ ఆదేశాల మేరకు ఎంఈవో–2 మాలిని పాఠశాలలో విచారణ జరిపారు. బాలికను గొడ్డును బాదినట్లు కొట్టడంపై స్కూల్ ప్రిన్సిపాల్ ఎం.శిరీషను వివరణ కోరారు. విద్యార్థిని కొట్టిన ఉపాధ్యాయురాలిపై చర్యలకు యాజమాన్యానికి సిఫార్స్ చేసినట్లు వివరణ ఇచ్చారు. మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. అయ్యప్ప దీక్షలో ఉన్నందుకు కొట్టలేదని, క్లాస్‌లో డల్‌గా ఉన్నందుకు కొట్టినట్లు వివరించారు. కొట్టడం తప్పేనని ఒప్పుకున్నారు. యాజమాన్యం సూచనలతో టీచర్‌పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. పాఠశాలలో సేకరించిన విషయాలు జిల్లా ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఎంఈవో–2 మాలిని తెలిపారు.
హనుమాన్‌జంక్షన్ రూరల్: బాపులపాడు మండలం వేలేరులో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గ్రామానికి చెందిన మారెళ్ల రమేష్ (33) గత కొంతకాలంగా భార్య, పిల్లలతో విభేదించి ఒంటరిగా నివసిస్తున్నారు. రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ జీవించే రమేష్ శుక్రవారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా, మృతుడు రమేష్ మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒంటరిగా ఉంటున్న రమేష్ కుటుంబ సమస్యల నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడా లేదా ఎవరైనా ఆత్మహత్యకు పురిగొల్పి ఉండవచ్చనే అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై హనుమాన్‌జంక్షన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వ్యక్తి మృతి.. ఇద్దరికి గాయాలు
జగ్గయ్యపేట: అదుపు తప్పి ఆటో బోల్తా పడిన ఘటనలో వ్యక్తి మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన మండలంలోని 65వ నంబర్ జాతీయ రహదారిపై తిరుమలగిరి ఆర్చి సమీపంలో గురువారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని గౌరవరం గ్రామంలో వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు తెలంగాణ రాష్ట్రం కోదాడకు చెందిన కంచల శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు, బంధువులు ఏడుగురు ఆటోలో వచ్చారు. కార్యక్రమం ముగిసిన అనంతరం రాత్రి 11 గంటల సమయంలో ఆటోలో వెళ్తుండగా తిరుమలగిరి ఆర్చి సమీపంలోకి వెళ్లే సరికి బ్రేక్ ఫెయిల్ కావటంతో సమీపంలోని కాల్వలోకి ఆటో పల్టీ కొట్టింది. దీంతో శ్రీనివాసరావు(55) అక్కడికక్కడే మృతి చెందగా.. ఆటోలో ఉన్న వెన్నా వెంకట రెడ్డి, అనుపోజు వెంకట రమణలకు తీవ్ర గాయాలు కావటంతో ఖమ్మం తరలించారు. మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. చిల్లకల్లు ఎస్‌ఐ తోట సూర్య శ్రీనివాస్ అక్కడకు చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఆక్స్‌ఫర్డ్ స్కూల్ ఘటనపై విద్యాశాఖ అధికారుల విచారణ


