లారీని వెనుక నుంచి ఢీకొట్టిన కారు
నందిగామ రూరల్: లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టిన ఘటనలో వ్యక్తి మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన నందిగామ పట్టణ శివారు అనాసాగరం సమీపంలో జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు జగ్గయ్యపేట నుంచి సిమెంట్ లోడుతో అవనిగడ్డ వెళ్తున్న లారీని గురువారం అర్ధరాత్రి సమయంలో అనాసాగరం సమీపంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపునకు వస్తున్న కారు వెనుకగా బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో విజయవాడ లబ్బీపేటకు చెందిన చెరుకూరు చంద్రశేఖర్ (54) అక్కడికక్కడే మృతి చెందగా కారు డ్రైవర్ యలమంచిలి జగదీష్‌తో పాటు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న సీఐ వైవీఎల్ నాయుడు సిబ్బందితో అక్కడకు చేరుకుని మృతదేహాన్ని, క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వాహనాలను పక్కకు తొలగించి ట్రాపిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. జగ్గయ్యపేటకు చెందిన లారీ డ్రైవర్ బిట్రా పుల్లారావును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. కాగా మృతుడు చంద్రశేఖర్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీని నడుపుతున్నాడు. రూ.కోట్లు విలువ చేసే కారు ప్రమాదంలో నుజ్జునుజ్జయింది.
ఒకరు మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు


