ముగిసిన కల్యాణ మహోత్సవాలు
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానంలో షష్ఠి కల్యాణ మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. చివరిరోజు గురువారం ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో వేదపండితులు కొమ్మూరి ఫణి కుమార్ శర్మ, ఆలయ ప్రధానార్చకుడు బుద్దు పవన్‌కుమార్ శర్మ, ఆలయ ఘనాపాటి నౌడూరి విశ్వనాథ సుబ్రహ్మణ్యశర్మ బ్రహ్మత్వంలో ఉదయం 6 గంటలకు ప్రాతఃకాలార్చనలు, గోపూజ, నిత్యహోమం, బలిహరణ, పంచామృతస్నపన, వసంతోత్సవం, మహా పూర్ణాహుతి, తీర్థప్రసాద వినియోగం, ఉదయం 11 గంటలకు శేషవాహనంపై రావివారిపాలెం గ్రామం వరకు శ్రీ స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. దారి పొడవునా భక్తులు స్వామివారికి కానుకలు చెల్లించి హారతులు అందుకున్నారు. రాత్రి 7 గంటలకు ద్వాదశ ప్రదక్షిణలు, 8 గంటలకు శ్రీ స్వామివారికి పుష్పశయ్యాలంకృత పర్యంకసేవ భక్తిభావంతో సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి వచ్చిన భక్తులు ఉత్సవంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు, చెన్న కేశవ పాల్గొన్నారు.


