వంశధార జట్టుపై కొల్లేరు జట్టు విజయం
మైలవరం: ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి డీఏ ఫుట్‌బాల్ లీగ్ పోటీలు మైలవరంలోని డాక్టర్ లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాల క్రీడా ప్రాంగణంలో జరుగుతున్నాయి. గురువారం ఉదయం జరిగిన మొదటి మ్యాచ్‌లో కొల్లేరు, వంశధార జట్లు తలపడ్డాయి. కొల్లేరు 4–1 గోల్స్ తేడాతో వంశధారపై గెలుపొందింది. గోదావరి, విశాఖ జట్ల మధ్య జరిగిన రెండో మ్యాచ్ 1–1 గోల్స్‌తో డ్రాగా ముగిసింది. మధ్యాహ్నం జరిగిన మొదటి మ్యాచ్‌లో పెన్నా, కోరమాండల్ జట్లు తలపడ్డాయి. పెన్నా జట్టు 3–0 గోల్స్ ఆధిక్యతతో కోరమాండల్ జట్టుపై గెలుపొందింది. రెండో మ్యాచ్‌లో తుంగభద్ర జట్టు నల్లమల జట్టుపై 4–2 గోల్స్ ఆధిక్యతతో గెలిచింది. ఈ మ్యాచ్‌లకు ముఖ్యఅతిథులుగా డైరెక్టర్, ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ పర్వతనేని సుభాష్‌బాబు, ఏరియా లీడర్ మూలుపూరి ఉపేంద్ర, ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ జి.రవీంద్ర రానా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ తరఫున వై.శేషగిరిరావు, బి.చక్రవర్తి, జి.ఎస్.ఎస్ పవన్‌కుమార్, పండరి శ్రీనివాస్ పోటీలను పర్యవేక్షించారు.


