ప్రగతి సూచికల్లో ఏ గ్రేడ్ సాధించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): స్వర్ణాంధ్ర – 2047 సాధన దిశగా చేస్తున్న ప్రయాణంలో ప్రతి శాఖకు చెందిన ప్రగతి సూచికల్లో పురోగతి కనిపిస్తోందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. ఇదే వేగంతో కృషిచేస్తూ నూరు శాతం ఏ గ్రేడ్ వచ్చేలా చూడాలని అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లోని శ్రీపింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కీలక ప్రగతి సూచికలు (కేపీఐ)పై వ్యవసాయ, అనుబంధ రంగాలు, మహిళా – శిశు సంక్షేమం, వైద్య ఆరోగ్యం, విద్య తదితర శాఖల అధికారులతో కలెక్టర్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ శాఖలకు సంబంధించి 563 కీలక ప్రగతి సూచికలకు సంబంధించి మండలాల వారీగా స్కోర్లు, గ్రేడ్లపై సమీక్షించారు. కొన్ని శాఖలు కొన్ని సూచికల్లో ఇంకా బీ, సీ గ్రేడ్లలో ఉన్నాయని అసంతృప్తి వ్యక్తంచేశారు. పటిష్ట ప్రణాళికతో సమ న్వయంతో ఏ గ్రేడ్‌కు చేరాలని ఆదేశించారు. ఆరోగ్య కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులు, ద్రవ వ్యర్థాల నిర్వహణ, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌ల నిర్మాణం, ఐదేళ్ల లోపు చిన్నారుల్లో ఎత్తు, బరువు వంటి ఆరోగ్య ప్రమాణాలు తదితరాలపైనా దృష్టిసారించాలన్నారు. ఉద్యాన పంటల దిశగా రైతులను ప్రోత్సహించడంతో పాటు అందుబాటులో పథకాలను సద్వినియోగం చేసుకునేలా చూడాలని సూచించారు. ముఖ్యంగా పశు సంవర్ధక రంగానికి సంబంధించి యానిమల్ షెల్టర్ల నిర్మాణంపై దృష్టిపెట్టాలన్నారు. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాలు వచ్చే సాగు కార్యకలాపాలు దిశగా అధికారులు రైతులను ప్రోత్సహిందాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. ఈ సమావేశంలో సీపీఓ వై.శ్రీలత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


