పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌లోని గోదావరి, రాజమండ్రి, కడియం సెక్షన్‌లో ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా జనవరి నెలలో ఆ మార్గంలో నడిచే పలు రైళ్లు పూర్తిగాను, కొన్నింటిని పాక్షికంగా రద్దు చేయడంతో పాటు మరికొన్ని రైళ్లను దారి మళ్లించి నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
పూర్తిగా రద్దు చేసిన రైళ్లు ఇవి..
జనవరి 29, 31 తేదీల్లో విజయవాడ–విశాఖపట్నం (12718/12717), జనవరి 29న విజయవాడ–రాజమండ్రి (67262/67261), జనవరి 28న రేణిగుంట–కాకినాడ పోర్టు (17249), జనవరి 29న కాకినాడ పోర్టు–రేణిగుంట (17250), జనవరి 28 నుంచి 31 వరకు గుంటూరు–విశాఖపట్నం (17239), జనవరి 29 నుంచి 31 వరకు విశాఖపట్నం–గుంటూరు (17240), జనవరి 29, 30న లింగంపల్లి–విశాఖపట్నం(12806), జనవరి 28, 29 తేదీలలో విశాఖపట్నం–లింగంపల్లి(12805), జనవరి 29, 31న రాజమండ్రి–విశాఖపట్నం(67285/67286), జనవరి 27న తిరుపతి–పూరి(17480), జనవరి 28న పూరి–తిరుపతి(17479), జనవరి 27న కాకినాడ పోర్టు–లింగంపల్లి (12775), జనవరి 28న లింగంపల్లి–కాకినాడ టౌన్(12776), ఈ నెల 28న తిరుపతి–విశాఖపట్నం(22708), జనవరి 29న విశాఖపట్నం–తిరుపతి (22707), జనవరి 29, 31న విజయవాడ–కాకినాడ పోర్టు (17257/17258), జనవరి 29న విజయవాడ–రాజమండ్రి(67202/67201), నర్సాపూర్–రాజమండ్రి (67246), రాజమండ్రి–భీమవరం జంక్షన్(67241), జనవరి 28, 29న మచిలీపట్నం–విశాఖపట్నం (17219) రైళ్లు పూర్తిగా రద్దు చేశారు.
పాక్షికంగా రద్దు చేసిన రైళ్లు..
చెంగల్‌పట్టు–కాకినాడ పోర్టు (17643) జనవరి 28న భీమవరం టౌన్–కాకినాడ పోర్టు మధ్య పాక్షికంగా రద్దు చేశారు. అదే విధంగా కాకినాడ పోర్టు– పుద్దుచ్చేరి (17655) ఈ నెల 29న కాకినాడ పోర్టు–భీమవరం టౌన్ మధ్య పాక్షికంగా రద్దు చేశారు.
దారి మళ్లింపు..
జనవరి 28న విజయవాడ డివిజన్‌లోని గోదావరి స్టేషన్ మీదుగా నడవాల్సిన అలప్పుజ–ధనాబాద్ (13352) రైలును కొవ్వూరు, రాజమండ్రి, కడియం మీదుగా దారి మళ్లించి నడపనున్నారు. అదే విధంగా బల్హార్షా, వరంగల్లు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ మీదుగా నడవాల్సిన హజరత్ నిజాముద్దీన్–విశాఖపట్నం(12804) రైలు జనవరి 28న నాగ్‌పూర్, దుర్గ్ జంక్షన్, లకోలి, సింగాపూర్ రోడ్డు, విశాఖపట్నం మీదుగా దారి మళ్లించి నడపనున్నారు.
చిలకలపూడి(మచిలీపట్నం): పూర్తిగా పరిపక్వానికి రాకుండా వరి పంట కోయవద్దని జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఎన్. పద్మావతి బుధవారం ఓ ప్రకటనలో రైతులకు సూచించారు. ముందుగా వరి పంట కోస్తే మిల్లుకు చేరిన ధాన్యం ఎక్కువగా తప్ప, తాలు గింజలు ఉండే అవకాశం ఉంటుందన్నారు. గింజ నాణ్యత సరిగా ఉండటమే కాకుండా పూర్తిగా తయారు కాకపోవటం, గింజ బరువు తక్కువగా ఉండటం, కాటాలో అనుకున్న దానికంటే తక్కువ బరువు నమోదు అవుతుందన్నారు. ధాన్యం మిల్లులో ఆడించినప్పుడు ముక్కలు అయ్యి హెడ్ రైస్ రికవరీ శాతం తగ్గుతుందన్నారు. దీని కారణంగా రైతుకు సరైన మద్దతు ధర లభించదన్నారు. ఇందుకోసం రైతులు జాగ్రత్త వహించి వరి పంట పూర్తిగా తయారయిన తర్వాతనే కోతలు ప్రారంభించాలన్నారు. తుపాను లేక అధిక వర్షాలు కురిసే సూచనలు ఉన్నప్పుడు వరి కోతలు వాయిదా వేసుకోవాలన్నారు. ఇప్పటికే కోత కోసి ఉంటే కుప్పలు వేసుకుని ధాన్యాన్ని టార్పాలిన్లతో కప్పి సంరక్షించుకోవాలని సూచించారు.
మైలవరం: ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి డీఏ ఫుట్ బాల్ లీగ్ పోటీలు మైలవరం డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి స్టేడియంలో రెండో రోజు బుధవారం హోరాహోరీగా కొనసాగాయి. మొదటి మ్యాచ్‌లో పెన్నా 3–1గోల్స్ ఆధిక్యంతో వంశధార జట్టుపై, రెండో మ్యాచ్‌లో గోదావరి జట్టు 4–0 గోల్స్ ఆధిక్యంతో కొల్లేరు జట్టుపై గెలుపొందింది. మధ్యాహ్నం జరిగిన మొదటి మ్యాచ్‌లలో విశాఖ జట్టు నల్లమల జట్టుపై 4–1 గోల్స్ ఆధిక్యంతో, తుంగభద్ర జట్టు కోరమాండల్ జట్టుపై 2–1 గోల్స్ ఆధిక్యతతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లకు ముఖ్య అతిథులుగా చాంబర్ ఆఫ్ కామర్స్ మైలవరం అధ్యక్షుడు సీహెచ్ మధుసూదనరావు, మైలవరం సర్పంచ్ మంజుభార్గవి పాల్గొన్నారు.
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్‌లో ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్న ఎన్‌టీపీసీ 42వ సబ్ జూనియర్స్ నేషనల్ ఆర్చరీ చాంపియన్ షిప్‌లో ఆంధ్రప్రదేశ్ కాంపౌండ్ బాయ్స్ టీమ్ బంగారు పతకాన్ని సాధించింది. బుధవారం జరిగిన ర్యాంకింగ్ రౌండ్‌లో పంజాబ్ టీమ్‌పై 218–232 తేడాతో ఏపీ కాంపౌండ్ బాయ్స్ టీమ్‌లోని ఆర్చర్‌లు పి.చరణ్‌శ్రీకర్, ఎం. సుహాస్, ఈ.సాయి రాధాకృష్ణమూర్తి, కె.బుద్దేశ్వరరావు బంగారు పతాకాన్ని సాధించారు. క్రీడాకారులను ఓల్గా ఆర్చరీ అకాడమీ చీఫ్ కోచ్, ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేసన్ చైర్మన్ చెరుకూరి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి బీవీ రమణ, కోశాధికారి చెరుకూరి కృష్ణకుమారి, ఉపాధ్యక్షుడు గొట్టిపాటి ప్రేమ్‌కుమార్, కోచ్‌లు నవీన్‌కుమార్, ఈ.సాహిత్, టి.శివశంకర్ మేనేజర్ కమల్‌కిషోర్ అభినందించారు.


