జనవరి 23, 24 తేదీల్లో రీసెర్చ్ కాన్‌క్లేవ్
పోస్టర్ ఆవిష్కరించిన సిద్ధార్థ డీమ్డ్ టుబీ యూనివర్సిటీ చాన్స్‌లర్ చౌదరి
పెనమలూరు: సిద్ధార్థ డీమ్డ్ టుబీ యూనివర్సిటీలో వచ్చే ఏడాది జనవరి 23, 24 తేదీల్లో రీసెర్చ్ కాన్‌క్లేవ్ –2026 నిర్వహిస్తున్నామని ఆ వర్సిటీ కులపతి కేవీ చౌదరి అన్నారు. ఆయన యూనివర్సిటీలో బుధవారం రీసెర్చ్ కాన్‌క్లేవ్–2026 పోస్టర్ ఆవిష్కరించి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కులపతి చౌదరి మాట్లాడుతూ కాన్‌క్లేవ్ పరిశోధన, పరిశ్రమలు–అకడమిక్ భాగస్వామ్యం బలోపేతం చేయటం, నూతన ఆవిష్కరణలకు వేదికగా ఈ కార్యక్రమం జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నామన్నారు. ప్రముఖ కంపెనీల ప్రతినిధులు రీసెర్చ్ కాన్‌క్లేవ్‌లో పాల్గొంటారన్నారు. ఉపకులపతి ప్రొఫెసర్ పి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రీసెర్చ్ కాన్‌క్లేవ్‌లో పాల్గొనటానికి జనవరి 5వ తేదీ వరకు నమోదు, జనవరి 8వ తేదీ ఫైనల్ రౌండ్ నోటిఫికేషన్ ఉంటుందన్నారు. సీఎస్‌ఈ, ఐటీ, ఈసీఈ, ఎంబీఏ విభాగాలు సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాయని చెప్పారు. ప్రో ఉపకులపతి డాక్టర్ ఏవీ రత్నప్రసాద్, రిజిష్ట్రార్ డాక్టర్ ఎం.రవిచంద్, డీన్‌లు పాల్గొన్నారు.


