చివరి గింజ వరకు ధాన్యం కొనాలి
తోట్లవల్లూరు: రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పామర్రు మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్‌కుమార్ డిమాండ్ చేశారు. మండల కేంద్రమైన తోట్లవల్లూరులో ఆయన మంగళవారం రాత్రి పర్యటించారు. మొంథా తుపాను కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని, ధాన్యం దిగుబడులు గణనీయంగా తగ్గుతున్నాయని అనిల్‌కుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. నాణ్యత, నిబంధనల పేరుతో అన్నదాతలను ఇబ్బందులకు గురి చేయకుండా సకాలంలో ధాన్యం కొనుగోళ్లు నిర్వహించాలన్నారు. రైతులకు అవసరమైన గోనె సంచులను రైతు సేవాకేంద్రాల ద్వారా అందుబాటులో ఉంచా లని కోరారు. కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.1790కు ధాన్యం కొనుగోళ్లు జరపాలని డిమాండ్ చేశారు. విపత్తులతో అల్లాడుతున్న రైతులను ఆదుకోవటంలో చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించటం అన్యాయమన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుతో వ్యవసాయం చేయాలంటేనే రైతులు భయపడే పరిస్థితులు దాపురిస్తున్నాయని మండిపడ్డారు. గత వైఎస్సార్ సీపీ హయాంలో రైతులకు అన్ని విధాలా అండగా ఉన్నామని గుర్తుచేశారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వటంతోపాటు రైతుభరోసా కేంద్రాల ద్వారా విస్తృత సేవలు అందించినట్లు తెలిపారు. వరదలు, విపత్తులతో పంటలు దెబ్బతిన్న రైతులకు సకాలంలో ఇన్సూరెన్స్, ఇన్‌పుట్ సబ్సిడీని అందజేసినట్లు అనిల్‌కుమార్ గుర్తు చేశారు. వ్యవసాయాన్ని పండుగలా చేసిన ఘనత వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని పేర్కొన్నారు.
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
కై లే అనిల్‌కుమార్


