పర్యాటక హబ్‌గా బెజవాడ
ఒకే డిజిటల్ వేదికపై పర్యాటక సమాచారం త్వరలో అందుబాటులోకి ఆంధ్రా ట్యాక్సీ యాప్ ప్రజారోగ్యం, భద్రతపై ప్రత్యేక దృష్టి వార్షిక వృద్ధి రేటు లక్ష్యంగా ప్రణాళిక సంక్రాంతి పండుగకు ప్రత్యేక కార్యక్రమాలు అంబేడ్కర్ స్మృతి వనం నిర్వహణ బాధ్యత ప్రభుత్వానిదే
పండగ శోభ ఉట్టిపడేలా సంక్రాంతి సంబరాలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: బెజవాడను పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దేందుకు వినూత్న కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన సోమ వారం మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. జిల్లాలో సేవారంగం అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇందులో భాగంగా టూరిజం ప్యాకేజీ వివరాలతో త్వరలో ఆంధ్రా ట్యాక్సీ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెస్తా మన్నారు. దీని పర్యవేక్షణను జిల్లా యంత్రాంగమే చూస్తుందని పేర్కొన్నారు. జిల్లాలో టెంపుల్ టూరిజంతోపాటు, హిస్టారికల్ పర్యాటకానికి మంచి అవకాశాలు ఉన్నాయని వివరించారు. ఇప్పటికే కొంత మంది యువకులను గుర్తించి గైడ్‌లుగా శిక్షణ ఇచ్చామని తెలిపారు.
పర్యాటక ప్రాంతాల్లో మౌలిక వసతులు
పర్యాటక ప్రాంతాల్లో మంచి నీటి సరఫరా, మరుగు దొడ్లు, రహదారులు వంటి ప్రాథమిక మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చామని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఆంధ్రా ట్యాక్సీ యాప్ పర్యాటకులకు ఏకీకృత వేదికగా సేవలు అందిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త ఏడాదికి కొండపల్లి బొమ్మల ఎక్స్‌పీరియన్స్ సెంటర్ అందుబాటులోకి వస్తుందన్నారు. మూలపాడు పార్కును అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. దుర్గగుడితో పాటు పవిత్ర సంగమం, చుట్టుపక్కల ప్రాంతాలు పర్యాటకులను ఆకర్షించనున్నాయని పేర్కొన్నారు. ఫ్లోటింగ్ యోగాలో ప్రపంచ రికార్డు సాధించి యోగాంధ్ర స్ఫూర్తిని దశదిశలా వ్యాప్తి చేశామన్నారు. దసరా ఉత్సవాలకు దుర్గగుడికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చినా ఎటువంటి ఇబ్బందులూ లేకుండా సమష్టి కృషితో నిర్వహించామన్నారు. త్వరలో జరిగే భవానీ దీక్షల విరమణలకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు.
ఎ.కొండూరు మండలానికి కృష్ణా జలాలు
ప్రజల ఆరోగ్యానికి, భద్రతకు అత్యంత ప్రాధాన్య ఇస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు అధికారులు, సిబ్బందితో కలిసి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఎ.కొండూరు మండలానికి కృష్ణా జలాలను కొత్త సంవత్సరంలో అందిస్తామ న్నారు. ప్రత్యేక అధికారుల బృందాలతో నిరంతరం హాస్టళ్లను తనిఖీ చేస్తున్నామని వివరించారు. ప్రజా భద్రతా చర్యల్లో భాగంగా ఆలయాలతో పాటు సినిమా హాళ్లు, పెట్రోల్ బంక్‌లు తదితరాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నామని తెలిపారు. ఫుడ్ సేఫ్టీకి ప్రాధాన్యం ఇచ్చి హోటళ్లలో తనిఖీలను ముమ్మరం చేశామని పేర్కొన్నారు. రైతు బజార్లలో తూకాల్లో తేడాలపై ఫిర్యాదులు వస్తున్నాయని, తూనికలు, కొలతల శాఖ అధికారులతో ప్రత్యేకంగా దాడులు చేయించి, కేసులు నమోదు చేస్తామని ప్రకటించారు. అంబేడ్కర్ స్మృతి వనం నిర్వహణ బాధ్యతను ప్రభుత్వమే తీసుకుందన్నారు. కల్చరల్ అండ్ టూరిజం శాఖకు పర్యవేక్షణ బాధ్యతను అప్పజెప్పామని, పెండింగ్ పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకొంటున్నామని వివరించారు.
కొత్త ఆవిష్కరణలకు చేయూత
యువతరం కొత్త ఆలోచనలను, పరిశ్రమల స్థాపన దిశగా నడిపించేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్‌టీఐహెచ్) చేయూత అందిస్తోందని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఇంక్యుబేషన్, ఆర్థిక మద్దతు, శిక్షణ, మార్కెటింగ్ ఇలా వివిధ అంశాల్లో ఎనికేపాడులోని ఆర్‌టీఐహెచ్ హబ్ స్పోక్ సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. ఈ స్పోక్ కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. పరిశ్రమలు స్థాపించే ఔత్సాహికులకు ఇది ఎంత గానో ఉపయోగ పడుతుందన్నారు.
సుస్థిర ఆర్థిక వృద్ధి దిశగా...
తలసరి ఆదాయంతో పాటు జిల్లా స్థూల దేశీయోత్పత్తి (జీడీడీపీ)లో ప్రగతికి సమగ్ర కార్యాచరణతో పనిచేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 563 కీలక ప్రగతి సూచికల్లో (కేపీఐ) అభివృద్ధికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో హరిత విస్తీర్ణాన్ని పెంచేందుకు గ్రామం యూనిట్‌గా లక్ష్యాలను నిర్దేశించామన్నారు. 25 శాతం ఉన్న హరిత విస్తీర్ణాన్ని దశల వారీగా 33 శాతానికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని వివరించారు.
జిల్లాలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు రూపకల్పన చేస్తున్నామని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పండుగ శోభ ఉట్టి పడేలా ముగ్గులు, సంప్రదాయ వంటకాల పోటీలు, బుల్‌షో వంటి కార్యక్రమాలతో జిల్లా ప్రజలలు, ఎన్‌ఆర్‌ఐలను ఆకర్షించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. వెస్ట్ బైపాస్ రోడ్డు పనులకు సంబంధించి చిక్కుముడులు వీడుతున్నాయని, ఫిబ్రవరి నాటికి పనులను పూర్తి చేస్తామని తెలి పారు. ఇప్పటికే హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను వెస్ట్ బైపాస్‌కు అనుమతించినట్లు పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్ది, వారు మరో పది మందికి ఉపాధి కల్పించేలా ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సంఘాల్లోని ఫ్యాషన్ డిజైనర్ల ఉత్పత్తులతో ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేసేందుకు చొరవ చూపుతున్నామని తెలిపారు.


