సమస్య పరిష్కారంలో ఉదాసీనత తగదు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కరించడంలో అధికారులు ఉదాసీనత విడనాడాలని, చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవా లని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టరేట్ ప్రాంగణంలోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమం సోమవారం జరిగింది.
జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ లక్ష్మీశ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కార ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తోందన్నారు. అర్జీలకు ఎండార్స్‌మెంట్ నంబర్ ఇచ్చి పరిష్కరిస్తామని చెప్పి చేతులు దులుపుకోవడం ఎంతవరకు సమంజసమో ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. రోజులో ఒక్క గంట అర్జీల పరిష్కారంపై దృష్టి పెడితే అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నారు. అర్జీకి సంబంధించిన సమస్యను పరిష్కరించేందుకు అర్జీదారుడు చెప్పే విషయాన్ని ఓపిగ్గా వినాలన్నారు. కింది స్థాయిలో జరుగుతున్న జాప్యాన్ని, అలసత్వం, అర్జీదారుడు పడుతున్న ఇబ్బందులు వంటి వాటిని క్షుణ్ణంగా పరిశీలించి సాధ్యమైనంతవరకు జిల్లా అధికారుల స్థాయిలోనే పరిష్కారం చూపాలన్నారు.
పీజీఆర్‌ఎస్‌లో 182 అర్జీలు
పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో మొత్తం 182 అర్జీలు స్వీకరించారు. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి అత్యధికంగా 53 అర్జీలువచ్చాయి.
శాఖల వారీగా అందిన అర్జీలు..
మునిసిపల్ 31, పోలీస్ 18, పంచాయతీరాజ్ 8, విద్య శాఖ 8, విద్యుత్ 7, విభిన్న ప్రతిభావంతులు 6, సర్వే 6, రవాణా 6, డీఆర్డీఏ 5, వైద్య, ఆర్యోగ 5, హౌసింగ్ 3, అర్‌అండ్‌బీ 3, కోఆపరేటివ్ 2, సాంకేతిక విద్య 2, దేవదాయ 2, సాంఘిక సంక్షేమం 2, మత్స్య, కార్మిక, డ్వామా, రిజిస్ట్రే షన్, ఇరిగేషన్, బీసీ వెల్ఫేర్, పొల్యూషన్, ఏపీఐఐసీ, ట్రజరీ, పౌరసరఫరాలు, వ్యవసాయ, గునులు, బ్యాంకుకు సంబంధించి ఒక్కో అర్జీ వచ్చాయి. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, గ్రామ/వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, కేఆర్‌సీసీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ కె.పోసిబాబు, ఏసీపీ కె.వెంకటేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్ లక్ష్మీశ


