మొక్కుబడిగా ‘రైతన్నా మీ కోసం’
ఘంటసాల: మండల కేంద్రమైన ఘంటసాలలో సోమవారం జరిగిన ‘రైతన్నా మీ కోసం’ కార్యక్రమం మొక్కుబడిగా సాగింది. ‘రైతన్న మీ కోసం’ వారోత్సవాలను వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఘంటసాల పీఏసీఎస్ చైర్మన్ బండి పరాత్పరరావు, టీడీపీకి చెందిన అయినపూడి యశోదర, దోనేపూడి విజయలక్ష్మితో మాత్రమే మంత్రి ముఖా ముఖీ నిర్వహించారు. తుపానుకు పంటలు దెబ్బ తిన్న రైతులు తమ సమస్యలపై నిలదీస్తారన్న భయంతోనో ఏమో ఎంపిక చేసిన మహిళా రైతులతో మాత్రమే మాట్లాడారు. మంత్రి తీరుపై అన్న దాతలు విస్మయం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఎవరైనా మిల్లర్లు ధాన్యం కొనుగోలులో తేమశాతం తదితర విషయాలపై రైతులను ఇబ్బందులు పెడితే బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. పంటలు బాగా పండుతున్నందుకు సంతోషంగా ఉన్నా గిట్టుబాటు ధరలేక బాధపడాల్సిన పరిస్థితి ఉందన్నారు. డిమాండ్ ఆధారంగా పంటలు పండించాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, డైరెక్టర్ మంజీర్ జిలాని సమూన్, జేసీ ఎం.నవీన్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎన్.పద్మావతి, ఉద్యాన శాఖ అధికారి జె.జ్యోతి తదితరులు పాల్గొన్నారు.


