అదృశ్యమైన వ్యక్తి మృతి
ఉయ్యూరు: అదృశ్యమైన వ్యక్తి పుల్లేరు కాలువలో శవమై తేలాడు. ఉయ్యూరు పట్టణంలోని రావిచెట్టు సెంటర్‌లో నివసించే కుంచవరపు రవికుమార్ 20 ఏళ్లుగా మీ–సేవ కేంద్రం నిర్వహిస్తున్నాడు. మంచి వ్యక్తిగా, సౌమ్యుడిగా పేరుపొందిన రవి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. బుధవారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల ఇళ్ల గాలించి ఆచూకీ లభించ కపోవడంతో గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కుటుంబ సభ్యుల సాయంతో రావిచెట్టు నుంచి ఫ్లోరా వంతెన వరకు సీసీ కెమెరాలను పరిశీలించారు. రవికుమార్ బుధ వారం అర్ధరాత్రి రెండు గంటల రెండు నిమిషాలకు పుల్లేరు కాలువపై ఫ్లోరా వంతెన వద్ద సంచరించినట్లు గుర్తించారు. అనారోగ్యంతో బాధపడుతూ, మతిస్థిమితం కోల్పోయి ఉండటంతో కాలువలో దూకి ఉంటాడన్న అనుమానంతో గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చేపట్టారు. గురువారం రాత్రి వరకు ఆచూకీ లభ్యం కాలేదు. పోలీసులు, రెవెన్యూ అధికారులు శుక్రవారం ఎన్‌డీ ఆర్‌ఎఫ్ బృందాన్ని రప్పించి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. రవికుమార్ మృతదేహం అమ్మనకాలనీ సమీపంలో కాలువలో లభించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రామారావు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
అదృశ్యమైన వ్యక్తి మృతి


