బీఎస్‌ఎన్‌ఎల్ వాయిస్ ఓవర్ వైఫై సేవలు ప్రారంభం
మధురానగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలో స్వదేశీ 4జీ సేవలు, సరికొత్త టవర్లను ప్రారంభించిన దరిమిలా ఆకర్షణీయమైన టారిఫ్‌లతో వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించాలని బీఎస్‌ఎన్‌ఎల్ సీఎండీ ఎ.రాబర్ట్ జెరార్డ్ రవి సూచించారు. స్థానిక చుట్టుగుంటలోని సంస్థ సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. స్వదేశీ 4జీ సేవలు ప్రారంభించినందున రాష్ట్రంలో చేపట్టాల్సిన విధివిధానాలను వివరించారు. బీఎస్‌ఎన్‌ఎల్ వద్ద ఉన్న నాణ్యమైన స్పెక్ట్రమ్, ఫైబర్ వంటి వనరులను వినియోగించుకునే కార్పొరేట్ సంస్థలను కలిసి, వారికి టెలికాం సేవలు అందించడంలో, సేవల నాణ్యతను మరింత పెంచాల్సిందిగా సూచించారు. తొలుత సరికొత్త సర్వీసు వాయిస్ ఓవర్ వైఫై సేవలను సీఎండీ రాబర్ట్ జెరార్డ్ రవి, టెలికాం ఏపీ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎం.శేషాచలంతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం రాబర్ట్ జెరార్డ్ రవి మాట్లాడుతూ వాయిస్ ఓవర్ వైఫైతో వినియోగదారులు టవర్ నెట్‌వర్క్ లేని ప్రాంతాల్లో సైతం అక్కడ ఉన్న వైఫై జోన్ ద్వారా వాయిస్ సేవలు పొందొచ్చని తెలిపారు. అనంతరం విజయవాడ నుంచి అమరావతి రోడ్డు మార్గంలో బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్‌ను పరిశీలించే డ్రైవ్ టెస్ట్ నిర్వహించారు. అవసరమైన చోట నెట్‌వర్క్ లభ్యత పెంపొందించే చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు.


