30న జింఖానా మైదానంలో కాపునాడు స్వర్ణోత్సవ సభ
భవానీపురం(విజయవాడపశ్చిమ): కాపునాడు స్వర్ణోత్సవ సభ కార్యక్రమ ఆహ్వాన పత్రికను విజయవాడలోని కాపునాడు జాతీయ అధ్యక్షుడు గాళ్ల సుబ్రహ్మణ్యం కార్యాలయంలో కాపు సామాజికవర్గ నాయకులు శుక్రవారం ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆకుల శ్రీనివాస్‌కుమార్ మాట్లా డుతూ... ఈ నెల 30వ తేదీ సాయంత్రం ఐదు గంట లకు గాంధీనగర్‌లోని జింఖానా మైదానంలో కాపునాడు స్వర్ణోత్సవ సభ జరుగనుందని తెలిపారు. కాపునాడు ఏర్పడిన 50 ఏళ్ల కాలంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నామని, వాటన్నింటిని అధిగమించి స్వర్ణోత్సవం దిశగా ప్రయాణించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కాపు సామాజికవర్గ సమస్యల పరిష్కారం కోసం కాపునాడు రాజీ లేని పోరాటం చేస్తోందని తెలిపారు. కాపునాడు చేపట్టిన ఉద్యమాలకు నాయకత్వం వహించిన మిరియాల వెంకట్రావు వంటి ఎందరో మహానుభావుల బాటలో కాపు నాయకులు పని చేస్తున్నా రని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాపునాడు జాతీయ అధ్యక్షుడు గాళ్ల సుబ్రహ్మణ్యం, మాచవరం ఆంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్ చోడిశెట్టి కృష్ణప్రసాద్, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ రత్నం రమేష్, కాపునాడు విజయవాడ అర్బన్ అధ్యక్షుడు పరుచూరు కరుణాకర్ (చిన్న), దుర్గా బ్యాంక్ మాజీ వైస్ చైర్మన్ అల్లం పూర్ణచంద్రరావు, రెడ్డిపల్లి సురేష్, వెంపటి ప్రభు, పసుపు లేటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.


