జీవనం కష్టమవుతోందని మత్స్యకారుల ఆవేదన
ఇబ్రహీంపట్నం: దళారుల చర్యలతో తమ జీవనోపాధి మార్గాలు మూసుకుపోతున్నాయని పలువురు మత్స్యకారులు జిల్లా మత్స్యశాఖ అధికారి చక్రాణి దృష్టికి తీసుకొచ్చారు. ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా మత్స్యకారులను ఉద్దేశించి చక్రాణి మాట్లాడుతూ.. త్వరలో భారీ ఎత్తున కృష్ణా నదిలో చేప పిల్లలను వదులుతామన్నారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందేలా చూస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా మత్స్యకారులు తమ ఆవేదన వినిపించారు. రాత్రింబవళ్లు నదిపై జీవించే తమకు ప్రభుత్వ సహకారం అందడం లేదన్నారు. పెద్దపెద్ద భవనాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లు ఉన్నవారికే ఈ ప్రభుత్వంలో లబ్ధిచేకూరుతుందని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. చేపలు పట్టే వలంటే తెలియని వారు మత్స్యకారుల ప్రయోజనాలు పొందుతున్నారని ఆరోపించారు. వారి వల్ల ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు వస్తోందని మండిపడ్డారు. అటువంటి వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మునిసిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, వైస్ చైర్మన్ చుట్టుకుదురు శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు.


