జీజీహెచ్‌లో అరుదైన స్వరపేటిక శస్త్ర చికిత్స
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్యూబర్ఫోనియా వ్యాధి కారణంగా మహిళ స్వరంతో మాట్లాడుతున్న 19 ఏళ్ల యువకుడికి జీజీహెచ్‌లో వైద్యులు అరుదైన, టైప్–3 థైరోప్లాస్టీ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. శస్త్ర చికిత్స అనంతరం సాధారణ పురుషుడి స్వరంతో ఆ యువకుడు మాట్లాడగలుగుతున్నాడు. ఏలూరు జిల్లాకు చెందిన 19 ఏళ్ల నర్సింగ్ విద్యార్థి కొంతకాలంలో గొంతు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. మహిళ స్వరంతో మాట్లాడుతున్నాడు. చికిత్స నిమిత్తం ఈఎన్‌టీ విభాగానికి రాగా, ఇక్కడి వైద్యులు పరీక్షలు చేసి అతడికి ప్వూబర్ఫోనియా వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. ఈఎన్‌టీ విభాగాధిపతి డాక్టర్ కె.రవి, వైద్య బృందం థైరోప్లాస్టీ శస్త్ర చికిత్స నిర్వహించి ఆ యువకుడికి సాధారణ స్వరం తీసుకొచ్చారు. ఈ నెల ఆరో తేదీన శస్త్ర చికిత్స చేయగా, ఆ యువకుడు ప్రస్తుతం పురుషుడి స్వరంతో మాట్లాడగలుగుతున్నాడు. అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించిన డాక్టర్ కె.రవి, ఎనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ ఎస్.వినయ్‌ను జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అన్నవరపు వేంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు అభినందించారు.


