యువతకు దేశ సేవలో పాల్గొనే అవకాశం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): భారత వాయుసేన (ఇండియన్ ఎయిర్ ఫోర్స్)లో ఉద్యోగ అవకాశాలపై శుక్రవారం విజయవాడ లయోల కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లోని ఏవీఎస్ రెడ్డి కాన్ఫరెన్స్ హాల్‌లో భారత వాయుసేన అధికారి వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ అలీతో కలెక్టర్ గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. ఇంటర్, తత్సమాన విద్యార్హతలు (పాలిటెక్నిక్, ఐటీఐ) ఉన్న విద్యార్థినీవిద్యార్థులు ‘అగ్ని వీర్ –వాయు’గా భారత వాయుసేనలో చేరొచ్చని సూచించారు. 17 సంవత్సరాల ఆరు నెలల నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల మధ్య వయసుగల యువతీయువకులు ఇందుకు అర్హులని పేర్కొన్నారు. చిన్న వయసులోనే దేశానికి సేవచేసే అవకాశం లభిస్తుందని, దీనిని యువత అందిపుచ్చుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ రాష్ట్రాల భర్తీ అధికారి, సికింద్రాబాద్ 12 ఎయిర్ మెన్ సెలక్షన్ సెంటర్ కమాండింగ్ ఆఫీసర్ వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ అలీ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని కరీంనగర్, పెద్దపల్లి, గుంటూరు, పల్నాడు జిల్లాలలో ‘అగ్ని వీర్ –వాయు’పై అవగాహన సదస్సులు నిర్వహించినట్లు తెలిపారు. ఇంటర్ తత్సమాన కోర్సుల్లో కనీసం 50 శాతం మార్కు లతో పాటు, ఇంగ్లిష్ సబ్జెక్టులో 50 శాతం మార్కులు పొందిన వారు ‘అగ్ని వీర్ – వాయు’కు అర్హులని స్పష్టంచేశారు. యువత, తల్లిదండ్రులు ఈ అవగాహన సదస్సుకు హాజరు కావాలని కోరారు. తిరువూరు డివిజన్‌లో శనివారం మరో అవగాహన సదస్సు నిర్వహిస్తామని చెప్పారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ


