ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు
ఒకరు మృతి మరొకరికి తీవ్రగాయాలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేసిన మృతుని కుటుంబ సభ్యులు
పెడన: ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రగాయాల పాలైన ఘటన పెడన మండల మడక వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పెడన మండలం లంకలకలువగుంట గ్రామానికి చెందిన మువ్వల చిన వెంకటేశ్వరరావు(60), చిరంగి నాగమల్లేశ్వరరావు(50) మడక గ్రామంలోని ఒక తోటలో రోజువారి కూలీ పనులకు గత రెండు, మూడు రోజులుగా వస్తున్నారు. అలాగే గురువారం ఉదయం కూడా గ్రామం నుంచి ద్విచక్ర వాహనంపై బయల్దేరి 216 జాతీయ రహదారి మీదుగా బంటుమిల్లి వైపు నుంచి మడక వద్దకు వస్తున్నారు. రెండు, మూడు నిమిషాల్లో తోటలోకి వెళ్లే వారే. అయితే వీరి ద్విచక్ర వాహనం ముందుగా ఆటో వెళ్తుండటంతో ఎదురుగా వస్తున్న వాహనాన్ని చూడకుండా రోడ్డును క్రాస్ చేశారు. అదే సమయంలో వేగంగా వస్తున్న కారు వీరి ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందగా, నాగమల్లేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయనను మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
కుటుంబ సభ్యుల ఆందోళన..
విషయం తెలిసిన మృతుని కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. బంధువులు, గ్రామస్తులు మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై, కారుకు అడ్డంగా బైఠాయించారు. పెడన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కె. నాగేంద్రప్రసాద్, ఎస్‌ఐ జి. సత్యనారాయణ, ఏఎస్‌ఐ లక్ష్మణరావు తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మృతుని కుటుంబసభ్యులతో మాట్లాడి ఆందోళనలు విరమింపజేశారు. కారు నడుపుతున్న వ్యక్తిని, కారును పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నరసాపురానికి చెందిన కారుపై ఎమ్మెల్యే అని స్టిక్కర్ ఉండటం గమనార్హం. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మృతదేహంతో పోలీస్ స్టేషన్ ఎదుట..
వెంకటేశ్వరరావు మృతదేహానికి మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రిలో పీఎం పూర్తవ్వగానే బంధువులు, గ్రామస్తులు అంబులెన్సులో గ్రామానికి తీసుకువెళ్లకుండా పెడన పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. కారుతో ఢీ కొన్న వారిని బయటకు పంపించాలని, వారితో తాము మాట్లాడుకుంటామని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పెడన సీఐ కె నాగేంద్రప్రసాద్, ఎస్‌ఐ సత్యనారాయణ వెంకటేశ్వరరావు కుమారుడికి చెప్పడంతో మృతదేహాన్ని గ్రామానికి తరలించారు.
ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు


