జల్సాల కోసం బైక్‌ల చోరీ
పోలీసులు అదుపులో నిందితుడు సుమారు రూ.22. 50లక్షల విలువ గల 45 బైక్‌లు స్వాధీనం వివరాలు వెల్లడించిన కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు
పామర్రు: రోజువారీ ఖర్చుల కోసం బైక్‌లను కాజేసి.. తాకట్టు పెడుతూ జల్సాలు చేస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు కృష్ణాజిల్లా ఎస్పీ విద్యా సాగర్ నాయుడు తెలిపారు. పామర్రులోని పోలీస్ స్టేషన్‌లో కేసు వివరాలను గురువారం ఆయన వెల్లడించారు. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన కోట్లో భాస్కర్‌రెడ్డి, పామర్రు మండలం జుఝవరం గ్రామానికి చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. కాగా ఇటీవల పామర్రులోని ఓ వైన్స్ దుకాణంలో జరిగిన గొడవలో భాస్కర్‌రెడ్డిని పామర్రు ఎస్‌ఐ రాజేంద్ర ప్రసాద్ అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో అతను బైక్ దొంగతనాలు చేస్తున్నట్లు వెల్లడించాడు. ఈ విషయాన్ని ఎస్‌ఐ ఉన్నతాధికారులకు తెలియజేయగా.. గుడివాడ డీఎస్పీ ధీరజ్ వినీల్ పర్యవేక్షణలో పామర్రు సీఐ సుభాకర్, ఎస్‌ఐ విచారించగా అతను పామర్రు, గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు, కంకిపాడు, విజయవాడ తదితర ప్రాంతాలలో మొత్తం 45 బైక్‌లు దొంగిలిచినట్లు ఒప్పుకున్నాడు. అలా దొంగిలించిన బైక్‌లను రూ.2వేల నుంచి రూ.3వేలకు తాకట్టు పెట్టి తన అవసరాలను తీర్చుకుంటున్నాడు.
రూ. 22.50లక్షల విలువ..
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని 8 పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అతని వద్ద నుంచి బైక్‌లను రికవరీ చేశారు. వీటి విలువ సుమారు రూ.22.50లక్షలు దాకా ఉండొచ్చని ఎస్పీ చెప్పారు. వీటిలో 26 బైక్‌లపై కేసులపై నమోదు అయినట్లు గుర్తించామని, మిగిలిన 19 బైక్‌లపై ఏ విధమైన కేసులు నమోదు కాలేదని వివరించారు. 19 వాహనాలు ఏ స్టేషన్ పరిధిలో చోరీ చేశాడో ధ్రువీకరణ కావలసి ఉందని పేర్కొన్నారు. దొంగను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ సుభాకర్, ఎస్‌ఐ రాజేంద్ర ప్రసాద్, ట్రైనీ ఎస్‌ఐ సత్యకళ, ఏఎస్‌ఐ అన్సారీ, హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుళ్లకు నగదు ప్రోత్సాహకాలను అందజేశారు.


