బిల్ కలెక్టర్లకు ఉద్యోగోన్నతులు
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలోని పలు మండలాల్లో పనిచేస్తున్న ఎనిమిది మంది బిల్ కలెక్టర్లకు జూనియర్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతి లభించింది. కలెక్టర్ డీకే బాలాజీ ఆయన చాంబర్‌లో ఉద్యోగోన్నతి పత్రాలను వారికి అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి జె. అరుణ, డీపీవో కార్యాలయ ఏవో సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గృహ నిర్మాణాలను వేగవంతం చేసి సకాలంలో పూర్తిచేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. గురువారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లోని ఏవీఎస్ రెడ్డి కాన్ఫరెన్స్ హాల్‌లో గృహాల నిర్మాణంపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ వివిధ స్థాయిలలో ఉన్న గృహాల నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలన్నారు. లబ్ధిదారు బిల్లులను ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాలని, ఈ విషయంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని చెప్పారు. గృహ నిర్మాణంలో ప్రజల సంతృప్తే గీటురాయి అని చెప్పారు. అధికారులంతా క్షేత్రస్థాయిలో పర్యటించి, లబ్ధిదారులతో నేరుగా మాట్లాడాలని, నిర్మాణాలు పూర్తి చేసే దిశగా ప్రోత్సహించాలని చెప్పారు. పీఎం ఆవాస్ యోజన (గ్రామీణ్) 2.0 సర్వే నిర్వహిస్తున్నామని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇళ్ల మంజూరు జరుగుతుందని తెలిపారు. గృహ నిర్మాణ శాఖ పీడీ రజనీకుమారి పాల్గొన్నారు.
గూడూరు: కృష్ణా యూనివర్సిటీకి గూడూరులో కేటాయించిన భూముల అన్యాక్రాంతంపై అధికారులు స్పందించారు. ఈనెల 4న ‘వర్సిటీ భూములు కృష్ణార్పణం’ అనే శీర్షికతో సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన యూనివర్సిటీ అధికారులు తమకు కేటాయించిన భూములను చూపాలంటూ జిల్లా కలెక్టర్‌ను కలిశారు. కలెక్టర్ సూచనతో వర్సిటీ ఇంజినీర్ బాబు సిబ్బందితో గురువారం గూడూరు మండల రెవెన్యూ అధికారులను సంప్రదించారు. దీంతో తహసీల్దార్ డి.రాజ్యలక్ష్మి, మండల సర్వేయర్ కె.మురళీకృష్ణ సిబ్బందితో కలసి క్షేత్రస్థాయికి వెళ్లారు. యూనివర్సిటీకి గూడూరు మండలంలో రెండు చోట్ల కేటాయించిన భూముల పటాలను స్థానిక రెవెన్యూ అధికారులకు వర్సిటీ వారికి చూపారు. వెంకటేశ్వరస్వామి గుడి వెనుక భాగంలో కేటాయించిన 19 ఎకరాలకు రోవర్ సహాయంతో హద్దులు చూపించారు. పటాన్‌పేట ప్రాంతంలో కేటాయించిన 25.58 ఎకరాలకు సంబంధించిన హద్దులు చూపడానికి రెండు రోజుల సమయం కోరారు.
బిల్ కలెక్టర్లకు ఉద్యోగోన్నతులు


