అందుబాటులోకి నూతన యాగశాల
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో దాతలు రూ.5కోట్లు వెచ్చించి నిర్మించిన యాగశాల గురువారం నుంచి వినియోగంలోకి వచ్చింది. కార్తిక అమావాస్యను పురస్కరించుకుని గురువారం నూతన యాగశాలలో గణపతి హోమం, నవగ్రహ హోమం, చండీహోమాలను ఆలయ అర్చకులు అంత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నూతన యాగశాలలో హోమాలను నిర్వహిస్తుండటంతో యాగశాలను పూలు, అరటి చెట్లు, మామిడి తోరణాలతో అలంకరించారు. చండీహోమంలో ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ దంపతులు హాజరయ్యారు. అమావాస్య నేపథ్యంలో చండీహోమానికి పెద్ద ఎత్తున ఉభయదాతలు నూతన యాగశాలకు విచ్చేశారు. గతంలో విశేష పర్వదినాలైన పౌర్ణమి, అమావాస్య, దశమి, ఏకాదశి, మూలా నక్షత్రం వంటి రోజులలో టికెట్ల సంఖ్యను కుదించడంతో పాటు ఆరుబయట కూర్చోవాల్సి వచ్చేదని భక్తులు పేర్కొన్నారు. నూతన యాగశాలలో సువిశాలమైన ప్రాంగణంలో ఉభయదాతలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో హోమంలో పాల్గొనే అవకాశం ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నూతన యాగశాలలో ఉభయదాతల సౌలభ్యం కోసం చేపట్టాల్సిన కొన్ని మార్పులను భక్తులు సూచించారు.
సహస్ర లింగార్చన సేవ..
కార్తిక మాసం ముగింపును పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై గురువారం మల్లేశ్వర స్వామి వారికి విశేష అభిషేకాలను నిర్వహించారు. సహస్ర లింగార్చన సేవను ఆలయ అర్చకులు రంగావజ్జుల శ్రీనివాసశాస్త్రి పర్యవేక్షణలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సహస్ర లింగార్చన అనంతరం స్వామి వారిని ఆలయ చైర్మన్ రాధాకృష్ణ దంపతులు దర్శించుకున్నారు.
నేడు పూర్ణాహుతి..
కార్తిక మాసం ముగింపును పురస్కరించుకుని శుక్రవారం మహా పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మల్లేశ్వర స్వామి వారి ఆలయ సమీపంలోని యాగశాలలో ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని ఆలయ వైదిక కమిటీ పేర్కొంది.
విశేష పర్వదినాల్లో దుర్గమ్మ భక్తులకు తప్పిన ఇక్కట్లు


