విద్యార్థి దశ నుంచి పుస్తక పఠనం అవసరం
గన్నవరం: విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరు పుస్తక పఠనం అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. సబ్జెక్టులపై తోటి విద్యార్థులతో చర్చించడం ద్వారా విజ్ఞానం మరింత పెరుగుతుందన్నారు. బుధవారం ఉంగుటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన ఆయన అక్కడ మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి, ఆహార పదార్ధాల నాణ్యతపై ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు కలిగి ఉండాలని సూచించారు. కేవలం మార్కుల కోసమే కాకుండా భవిష్యత్‌లో నూతన ఆవిష్కరణలు చేసే జ్ఞానం కోసం పాటు పడాలన్నారు. ముఖ్యంగా మౌఖిక, రాతపూర్వక కమ్యూనికేషన్‌లను అభివృద్ధి చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ప్రతిరోజు మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టే విధంగా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ద వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో గుడివాడ డీవైఈఓ కొండా రవికుమార్, ఎంపీడీఓ ఈ.సత్యకుమార్, హెచ్‌ఎం సిహెచ్. అనిత పాల్గొన్నారు.
కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ


