అక్రమాలకు నిలయాలుగా ‘ఉత్తుత్తి’ కొనుగోలు కేంద్రాలు
కొరవడిన పాలకుల పర్యవేక్షణ..
జిల్లాలో 87,908 ఎకరాల్లో పత్తి సాగు..
జిల్లాలో ఆరు కొనుగోలు కేంద్రాలు...
ఎన్టీఆర్ జిల్లాలో సీసీఐ ఆరు పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. వాటిలో నందిగామ నియోజకవర్గంలోని కంచికచర్ల, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గంలోని జగ్గయ్యపేట, మైల వరం నియోజకవర్గంలోని మైలవరం, ఏ కొండూరు, తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెం మండలాల్లోని వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. కనీస మద్దతు ధరను క్వింటాకు నాణ్యతను బట్టి రూ.7,710 నుంచి రూ. 8,110గా నిర్ణయించింది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ప్రారంభించిన కొనుగోలు కేంద్రాల్లో ఒక్క దానిలో కూడా పత్తిని సీసీఐ అధికారులు కొనుగోలు చేయడంలేదు. దళారుల సహకారంతో పత్తిని తక్కువ ధరకు కొనుగోలు చేయించి సీసీఐ అధికారులు లబ్ధి పొందుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మరోవైపు పత్తిని దళారుల వద్ద అమ్ముకోవద్దని సీసీఐ ద్వారా పత్తిని విక్రయించాలని అధికారపార్టీ నేతలు రైతులతో చెబుతున్నారు. సీసీఐ అధికారులు కేవలం ప్రజా ప్రతినిధుల దృష్టికి మరల్చేందుకే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కారణాలు హాస్యాస్పదం..
కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తిని కొనుగోలు చేయకపోవటంపై సీసీఐ అధికారులు హాస్యాస్పద ప్రకటనలు చేస్తున్నారు. కేంద్రాల వద్ద కొనుగోలు చేసిన పత్తిని గుంటూరులోని మిల్లుల వద్దకు రవాణా చేసేందుకు ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్ట్ టెండర్లు పిలిచామని, ఆ టెండర్ల ప్రక్రియ పూర్తికాకపోవటంతో పత్తిని కొనుగోలు చేయలేకపోతున్నామని కుంటి సాకులు చెబుతున్నారు. అయితే టెండర్ల ప్రక్రియ ఒకటి లేదా రెండు రోజుల్లో పూర్తి చేయాల్సి ఉన్నా కాని సీసీఐ అధికారులు కావాలనే జాప్యం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీని ద్వారా తమను అసహానికి గురిచేసి.. దళారులను ఆశ్రయించేలా చేస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. దళారుల నుంచి పత్తి కొనుగోలు చేయటం ద్వారా సీసీఐ అధికారులు ట్రాన్స్‌పోర్టు కిరాయిని దోచుకుంటున్నారు. రైతుల వద్ద ఉన్న పత్తికి దళారులు క్వింటాకు రూ. 4వేల నుంచి రూ. 5వేలు ధరను మాత్రమే ఇచ్చి దోచుకుంటున్నారు.
ఎన్టీఆర్ జిల్లాలోని రైతులు మొత్తం 87,908 ఎకరాల్లో పత్తి పంట సాగుచేశారు. అయితే తుపా ను ప్రభావంతో కురిసిన వర్షాలకు కొంత మేర పత్తి పంట దెబ్బతింది. గతంలో ఎకరానికి 15 క్వింటాళ్ల దిగుబడి రాగా.. ఈ ఏడాది 5 క్వింటాళ్ల లోపే దిగుబడి వచ్చిందని రైతులు అంటున్నారు. ఈ లెక్కన 4,39,540 క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చింది. కానీ ప్రభుత్వం సీసీఐ ద్వారా కేవలం 400 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసి, ఏదో గొప్పపని చేసినట్లు ప్రకటనలు గుప్పిస్తోంది.
కేంద్రాలు ప్రారంభించినా..
పంట కొనుగోలు చేయని సీసీఐ
అడ్డగోలుగా దోచుకుంటున్న దళారులు
వారికే కొమ్ము కాస్తోన్న సీసీఐ
పట్టించుకోని చంద్రబాబు సర్కారు
ఎన్టీఆర్ జిల్లాలో 87,908
ఎకరాల్లో పత్తి సాగు
చంద్రబాబు సర్కారు పత్తి రైతు సమస్యలపై దృష్టి సారించడం లేదు. ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు రైతుల నుంచి పత్తిని సీసీఐ కొనుగోలు చేయాలని పిలిపించారు. కానీ వారు మాత్రం ప్రజా ప్రతినిధుల మాటను లెక్క చేయకుండా పాత పాటే పాడుతున్నారు. రవాణా టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాతే కొనుగోలు కేంద్రాల నుంచి పత్తిని కొంటామని చెబుతున్నారు. అయితే నిర్ధిష్టమైన తేదీని ప్రకటించలేకపోతున్నారు. రైతులు మాత్రం ఈ ఏడాది పత్తికి నాణ్యతతో సంబంధం లేకుండా పూర్తి మద్దతు ధరతో పత్తిని కొనుగోలు చేయాలని కోరుతున్నారు.
అక్రమాలకు నిలయాలుగా ‘ఉత్తుత్తి’ కొనుగోలు కేంద్రాలు


