ప్రైవేటు నిర్లక్ష్యం
ఓవర్ టేక్ చేసే క్రమంలో ప్రమాదం
ప్రాణాలు తీస్తున్న
నుజ్జునుజ్జయిన కావేరి ట్రావెల్స్ బస్సు
కంచికచర్ల: ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకుల నిర్లక్ష్యం ప్రయాణికుల ప్రాణాలను బలితీసుకుంటోంది. డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగం, నిబంధనలు పాటించకపోవడం వంటి కారణాలతో ట్రావెల్స్ బస్సులు వరుసగా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. గత అక్టోబర్ 24వ తేదీ తెల్లవారుజామున కర్నూలు జిల్లా కల్లూరు మండలం చినటేకూరు వద్ద ఓ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఆ వాహనం మంటల్లో చిక్కుకుని 20 మంది ప్రయాణికులు మృతిచెందిన విషయం విదితమే. పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడు గ్రామం వద్ద 2017 ఫిబ్రవరి 28వ తేదీన దివాకర్ ట్రావెల్స్ బస్సు రోడ్డు మధ్యలో ఉన్న కల్వర్టులోకి దూసుకెళ్లిన ప్రమాదంలో పదిమంది మృత్యువాత పడ్డారు. తాజాగా నందిగామ సమీపంలోని అనాసాగరం వద్ద మంగళవారం తెల్లవారుజామున మరో ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్తున్న కావేరి ట్రావెల్ బస్సు అనాసాగరం వద్ద సుగర్ లోడుతో వెళ్తున్న లారీని అతివేగంతో వెనుక నుంచి ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా, మరో ఎనిమిది మంది స్వల్పంగా గాయపడ్డారు. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
జాతీయ రహదారిపై నిత్యం ప్రమాదాలు
విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే 65వ నంబర్ జాతీయ రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. అధిక వేగం, డ్రైవర్ల నిర్లక్ష్యం, ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఎక్కువగా ప్రైవేటు బస్సులే ప్రమాదాలబారిన పడుతున్నాయి. ఈ బస్సులు గరిష్టంగా 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంగా రాకపోలు సాగిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి నాలుగు గంటల్లోనే విజయవాడ చేరుతున్నాయి. నందిగా మలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదానికి అతివేగమే కారణమని తెలుస్తోంది. ఈ నెల 16వ తేదీన హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వెళ్లే దాసరి ట్రావెల్ బస్సు ఎయిర్ పైపు కంచికచర్ల మండలం కీసర టోల్‌ప్లాజా వద్ద లీకై ంది. పెద్ద శబ్దంతో బస్సు ఆగిపోయింది. ఆ సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఎటువంటి ప్రమాదం జరగలేదు. అదే రోజు హైదరాబాద్ వైపు నుంచి విజయవాడ వైపు ప్రయాణిస్తున్న కారు ముందు వెళ్తున్న బైక్‌ను, అనంతరం ట్యాంకర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా కాలిపోయింది. అయితే కారులోని వారు క్షేమంగా బయటపడ్డారు. ఇటీవల మునగచర్ల వద్ద జరిగిన మరో ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో గత ఏడాది 420 మంది, ఈ ఏడాది 328 మంది మృతి చెందారు. 1,200 మందికి పైగా గాయపడ్డారు.
రాత్రి సమయాల్లో
ప్రమాదాల నివారణకు చర్యలు
రోడ్డు ప్రమాదాలను నివారించడానికి పోలీసులు తెల్లవారు జాము రెండు నుంచి ఐదు గంటల మధ్యలో స్టాప్, వాష్, రిఫ్రెష్ అండ్ గో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వాహనాలను ఆపి, డ్రైవర్లకు నీరు అందించి, ముఖం కడుక్కుని కొంత సేపు విశ్రాంతి తీసుకున్న తరువాత ప్రయాణం కొనసాగించేలా చూస్తున్నారు. జిల్లాలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి, వాటి వద్ద ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. నందిగామ, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో ఇప్పటికే ట్రాఫిక్ బ్లింకర్లను, రంబుల్ స్టిక్‌లను ఏర్పాటు చేశారు.
నందిగామలోని అనాసాగరం ఫ్లై ఓవర్‌పై సుగర్ లోడుతో వెళ్తుతున్న లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైందని పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖరబాబు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ పరారయ్యాడని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 23 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. కాళ్లు, చేతులు విరిగిన వారిని విజయవాడ ఆస్పత్రికి రిఫర్ చేశామన్నారు. మిగిలిన ప్రయాణికులను ప్రత్యామ్నాయ బస్సుల్లో వారి గమ్యస్థానాలకు తరలించామని తెలిపారు.
ప్రైవేటు నిర్లక్ష్యం


