స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్ఫూర్తితో అడుగులు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్ఫూర్తితో అడుగులేద్దామని, సమష్టి కృషితో పారిశ్రామిక అభివృద్ధిలో జిల్లాను రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దుదామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పిలుపునిచ్చారు. కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశం మంగళవారం జరిగింది. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులో జిల్లాకు సంబంధించి రూ.69 వేల కోట్లతో 100 ఎంఓయూలు కుదిరాయని తెలిపారు. వివిధ అనుమతులకు సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి ఈ నెల 17వ తేదీ వరకు సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా 6,037 దరఖాస్తులు రాగా 5,949 దరఖాస్తులు పరిష్కారమయ్యాయని చెప్పారు. వివిధ పారిశ్రామిక అభివృద్ధి విధానాల కింద 18 క్లెయిమ్‌లకు రూ.1.54 కోట్ల ప్రోత్సాహకాలకు కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల అధికారి ఎం.మధు, డీపీఓ పి.లావణ్యకుమారి, సాంఘిక సంక్షేమ అధికారి రమాదేవి, ఎల్‌డీఎం కె.ప్రియాంక, పీసీబీ ఈఈ పి.శ్రీనివాసరావు, విఽవిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


