అన్నదాత ఆశలను చిదిమేసిన ‘మోంథా’
ప్రభుత్వం ఆదుకోకుంటే ఎలా..
సాక్షి ప్రతినిధి, విజయవాడ: మోంథా తుపాను అన్నదాతలకు గుండె కోతను మిగిల్చింది. బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలకు రైతుల ఆశలు నేలకు వాలాయి. మరికొన్ని రోజుల్లో పంట చేతికొస్తుందనుకున్న తరుణంలో పంట నీటి పాలై, తీవ్ర నష్టాలు మిగిలాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 1.5 లక్షల ఎకరాల్లో పంట నీట మునిగింది. కోతకు వచ్చిన వరితోపాటు, చిరుపొట్ట, కంకి, గింజ గట్టి పడే దశలో ఉన్న పైరు నేలకొరిగింది. పత్తి, మిరప, మొక్కజొన్న, వేరుశనగ అరటి, బొప్పాయి, కూరగాయల పంటలకూ తీవ్ర నష్టం వాటిల్లింది. వ్యవసాయశాఖ అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం కృష్ణా జిల్లాలో వ్యవసాయ పంటలు 1,15,692.5లక్షల ఎకరాలు, ఉద్యాన పంటలు 3540.55 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. ఎన్టీఆర్ జిల్లాలో వ్యవసాయ పంటలు 42,483 ఎకరాలు, ఉద్యాన పంటలకు 586.5 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. క్షేత్ర స్థాయిలో పంట సర్వే ఇంకా పూర్తి కాలేదు. దీంతో పంట నష్టం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
ఎంత కష్టం.. ఎంత నష్టం..
‘సాక్షి’ బృందం తుపాను ప్రభావితమైన కొన్ని గ్రామాల్లోకి వెళ్లి, వాస్తవ పరిస్థితిని పరిశీలించింది. రైతన్నలను ఎవరిని కదిలించినా.. కన్నీళ్లే కనిపిస్తున్నాయి. తమ కళ్ల ముందే నేల వాలిన పంటను చూసి తల్లడిల్లిపోతున్నారు. ఎకరానికి కౌలు రూ.30వేలు, పెట్టుబడి రూ.35వేలు గంగ పాలైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పది రోజుల్లో చేతికొచ్చే పంట పూర్తిగా నీళ్లలో నాని కుళ్లి పోతుందని, గింజలు మొలకెత్తుతాయని ఆందో ళన చెందుతున్నారు. అరకొరగా మిగిలిన పంట కొయాలన్నా, మామూలు సమయంలో పంట కోతకు ఎకరానికి 2 గంటల సమయం పడితే.. ఇప్పుడు వరి కోయాలంటే 4 గంటల సమయం పట్టే అవకాశం ఉండటంతోపాటు, గింజలు రాలిపోతాయని మదన పడుతున్నారు. ఒక వేళ కొంత మంది రైతులు ధైర్యం చేసి నేలవాలిన పంటను పైకి లేపి కట్టాలన్నా ఎకరాకు 100 మంది కూలీలు అవుతున్నారని, కూలీ రూ.330 చొప్పున రూ.33వేలు అవుతుందని పేర్కొంటున్నారు. అయితే పది బస్తాలు వచ్చే పంట, దీని వల్ల 20 బస్తాలు మాత్రమే వస్తుందని దీని వల్ల ఉపయోగం పెద్దగా లేదని వాపోతున్నారు. పెట్టే పెట్టుబడి డబుల్ అవుతుండగా, దిగుబడిలో మాత్రం సగమే వస్తోందని బాధ వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ మంది రైతులు నేలకు వాలిన వరి పంటను పైకి లేపి కట్టడానికి వీలు కాక అలానే వదిలేస్తున్నారు. కొన్ని చోట్ల పాలు, సుంకు దశలో ఉందని, గాలికి కంకులు రాసుకొని సుంకు రాలి పోయిందని, నేలకు వాలకుండా అక్కడ ఉన్న పైరుకూడా ఉపయోగం లేదని తప్ప, తాలు అవుతుందని భారీగా పంట దిగుబడులు తగ్గుతాయని కన్నీటి పర్యంతమవుతున్నారు.
ప్రభుత్వం ఎకరానికి ఇచ్చే పదివేలు ఏమూలకూ సరిపోవని, పంట నష్ట పరిహారం పెంచి ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు ముక్త కంఠంతో పేర్కొంటున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పంట నష్టపోతే ఎకరానికి రూ.25వేల ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకొంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో కనీసం యూరియా కూడా దొరకక రూ.275 యూరియా బస్తాను రూ.600–రూ.800లకు బ్లాక్‌లో కొన్నామని, దీని కోసం పగలూ రాత్రిళ్లు పడిగాపులు కాయాల్సి వచ్చిందని తమ ఆవేదనను వెలిబుచ్చుతున్నారు. పంట నష్ట పరిహారం వచ్చినా, పొలాల్లో పండిన అరకొర ధాన్యాన్ని కొనమని ప్రభుత్వం మెలిక పెడుతోందని.. ఇది ఎంత వరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. రైతులకు రైతు భరోసా ఇచ్చిన ప్రభుత్వం, పంటలు సాగు చేసే కౌలు రైతుల పట్ల కనికరం లేకుండా వ్యవహరిస్తోందని, రెండేళ్లుగా రైతు భరోసా అందటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అన్నదాత ఆశలను చిదిమేసిన ‘మోంథా’
అన్నదాత ఆశలను చిదిమేసిన ‘మోంథా’
అన్నదాత ఆశలను చిదిమేసిన ‘మోంథా’


