గిరిజన యోధుల త్యాగాలు చిరస్మరణీయం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రాణాలను పణంగా పెట్టి భావితరాలకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలను అందించాలనే మహోన్నత లక్ష్యంతో ఎందరో గిరిజన యోధులు గొప్ప పోరాటాలు చేశారని, వారి త్యాగాలు చిరస్మరణీయమని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. ఈ నెల 15న జన జాతీయ గౌరవ దినోత్సవం (బిర్సా ముండా జయంతి) సందర్భంగా ఆ రోజు వరకు గిరిజన స్వాభిమాన ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల ప్రారంభ కార్యక్రమం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో శనివారం జరిగింది. గిరిజన సంక్షేమం కోసం విశేష కృషి చేస్తున్న వారితో కలిసి బిర్సా ముండా, అల్లూరి సీతారామరాజు, గాం గంటం దొర తదితర యోధుల చిత్రపటాలకు పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
సద్వినియోగం చేసుకోవాలి..
అనంతరం కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల సంక్షేమం, ఆరోగ్యం కోసం వివిధ పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నాయన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో ఎ.కొండూరు, గిరిజన తండాల్లోని గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. గిరిజన స్వాభిమాన ఉత్సవాల ప్రాధాన్యతను జిల్లా గిరిజన సంక్షేమం, సాధికారత అధికారి ముదిగొండ ఫణి ధూర్జటి వివరించారు. గిరిజనుల విద్యకు, నైపుణ్యాభివృద్ధికి బాల భవన్ చేస్తున్న కృషిని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జోసఫ్ తంబి వివరించారు.
బ్రిటీష్ వలసవాదంపై తిరుగుబాటుగా సాగిన భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న యోధునిగా గుర్తింపు సాధించిన భగవాన్ బిర్సా ముండా పోరాట పటిమను, ఆయన ఆశయాలను డాక్టర్ బి.జ్యోతిలాల్ నాయక్ వివరించారు.


