రైతుకు పరిహారం అందేవరకు పోరాడుతాం
పెనుగంచిప్రోలు: మోంథా తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించేంత వరకు పోరాడుతామని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండి తోక జగన్మోహనరావు, పార్టీ జగ్గయ్యపేట ఇన్‌చార్జి తన్నీరు నాగేశ్వరరావుతో కలిసి శనివారం ఆయన నందిగామ మండలంలోని మాగల్లు, పెనుగంచిప్రోలు మండలంలోని గుమ్మడిదుర్రు, అనిగండ్లపాడు, ముచ్చింతాల, పెనుగంచిప్రోలులో వరద ముంపునకు గురైన పంట పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రైతుల ముఖాల్లో ఆనందం చూశామని, ప్రభుత్వమే పంటల బీమా చేసి ఆపత్కాలంలో వారిని ఆదుకుందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం పంటలకు బీమా చెల్లించకుండా చేతులెత్తేసిందన్నారు.
గండ్లు పూడ్చకపోవడంతోనే...
మునేరు తువ్వకాలువకు గత ఏడాది సెప్టెంబర్ నెలలో వచ్చిన తుపానుకు 50 గండ్లు పడితే ఏడాది దాటినా ఆ గండ్లు పూడ్చక పోవటంతో పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాల్లో 2,500 ఎకరాల్లో వరి నీట మునిగి రైతులు పూర్తిగా నష్టపోయారన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో తువ్వ కాలువకు గండ్లు పడితే వెంటనే పూడ్చామని గుర్తు చేశారు. తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ వరికి కౌలుతో కలుపుకొని ఎకరానికి రూ.50 వేలు రైతులు పెట్టుబడి పెట్టారని, పంట చేతికొచ్చే సమయంలో రైతులు నష్టపోయారన్నారు. మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు మాట్లాడుతూ జగనన్న పాలనలో పంట నష్టపోతే నష్టపరిహారం వెంటనే ఇచ్చి రైతులను ఆదుకుందన్నారు. పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ఏలూరి శివాజీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిరుమామిళ్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
తువ్వ కాలువ గండ్లు ఏడాదైనా పూడ్చని అసమర్ధ ప్రభుత్వం
పంటల బీమా చెల్లించకుండా చేతులెత్తేసిన సర్కారు
వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్


