దుర్గమ్మ మండల దీక్షలు ప్రారంభం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో కొలువై ఉన్న దుర్గమ్మ వారి మండల దీక్షలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. శనివారం ఉదయం అమ్మవారి ప్రధాన ఆలయంలోని మూలవిరాట్‌కు ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం పగడాల మాలను అలంకరించారు. అనంతరం ఉత్సవ మూర్తిని ప్రత్యేకంగా పూలతో అలంకరించిన పల్లకీపై ఊరేగింపుగా మహా మండపం ఆరో అంతస్తుకు మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ తీసుకొచ్చారు. మహామండపం ఆరో అంతస్తులో వేదికపై అమ్మవారి ఉత్సవమూర్తి అధిరోహించిన అనంతరం కలశస్థాపన, గణపతి పూజ, అఖండ జ్యోతి ప్రజ్వలన చేశారు. అమ్మవారి ఉత్సవ మూర్తికి అలంకరించిన ఎరుపురంగు పూసల దండలను భక్తుల మెడలో వేసి దీక్షలను ప్రారంభించారు. పూజా కార్యక్రమాలను ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యుల పర్యవేక్షణలో నిర్వహించగా, ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఏఈవో వెంకటరెడ్డి పాల్గొన్నారు. కార్తిక ఏకాదశిన ప్రారంభమైన మండల దీక్షల స్వీకరణ కార్యక్రమం కార్తిక పౌర్ణమి 5వ తేదీ వరకు కొనసాగుతాయని అర్చకులు పేర్కొన్నారు. భవానీ మండల దీక్షల ప్రారంభాన్ని పురస్కరించుకొని అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు ఆరో అంతస్తులోని వేదిక, ఆలయంలోకి ప్రవేశించే అన్ని మార్గాలను రంగురంగుల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.
ఏకాదశి పుణ్య స్నానాలు..
అమ్మవారి దీక్షలు స్వీకరించే భక్తులు తెల్లవారుజామునే దుర్గాఘాట్‌కు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం దుర్గగుడి ఘాట్ రోడ్డులోని కామథేను అమ్మవారితో పాటు మహా మండపం ఆరో అంతస్తుకు తరలివచ్చి ఆలయ అర్చకుల చేతుల మీదుగా దీక్షలను స్వీకరించారు. కార్తిక ఏకాదశి నేపథ్యంలో మహిళలు పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం కార్తిక దీపాలను వెలిగించారు.
చిన్నారులకు మాలధారణ చేయిస్తున్న గురుస్వామి


