వృద్ధురాలి హత్యకేసులో నిందితుడి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

వృద్ధురాలి హత్యకేసులో నిందితుడి అరెస్టు

Jul 19 2025 1:01 PM | Updated on Jul 19 2025 1:01 PM

వృద్ధురాలి హత్యకేసులో నిందితుడి అరెస్టు

వృద్ధురాలి హత్యకేసులో నిందితుడి అరెస్టు

కంకిపాడు: వృద్ధురాలి హత్యకేసును కంకిపాడు పోలీసులు చేధించారు. గన్నవరం డీఎస్పీ సిహెచ్‌ శ్రీనివాసరావు కంకిపాడు పోలీసుస్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో కేసు పూర్వాపరాలను వెల్లడించారు. మంతెన గ్రామానికి చెందిన తిరుమల స్వర్ణకుమారి(70)ని ఈనెల 13వ తేదీన ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో దారుణ హత్యకు గురికాగా, ఆమెను అదే గ్రామానికి చెందిన తిరువీధుల భవానీ ప్రసాద్‌ (24) హత్య చేసినట్లు పోలీసులు గుర్తించి అతన్ని అరెస్ట్‌ చేశారు.

ఆన్‌లైన్‌ రమ్మీకి బానిపై..

కేసు వివరాల్లోకి వెళితే..ఆన్‌లైన్‌ రమ్మీకి అలవాటు పడ్డ భవానీప్రసాద్‌, అప్పులు తీర్చడం కోసం యాప్‌లలోనూ అప్పులు చేశాడు. ఈక్రమంలో ఈనెల 3, 4తేదీల్లో మృతురాలి స్వర్ణకుమారి ఇంట్లో టైల్స్‌ పనికి చేరాడు. పగటివేళలో స్వర్ణకుమారి భర్త వెంకటేశ్వరరావు పొలానికి వెళ్తుండటంతో ఆమె ఒంటరిగా ఉండటాన్ని గుర్తించాడు. ఈనెల 13న స్వర్ణకుమారికి ఫోన్‌చేసి మిగిలిన టైల్స్‌ ముక్కలు కావాలని అడిగాడు. వచ్చి తీసుకోమని చెప్పడంతో ఇంట్లోకి ప్రవేశించిన భవానీప్రసాద్‌, వంట గదిలో ఉన్న స్వర్ణకుమారి మెడ చుట్టూ ఫోన్‌ చార్జింగ్‌ వైర్‌ను బిగించడంతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. బతికి ఉందనే అనుమానంతో వంట గదిలో ఉన్న చాకుతో ఆమె ఎడమచేతి మణికట్టును కోశాడు. మృతురాలి మెడలోని రెండు పేటల బంగారు నానుతాడు (47 గ్రాములు), మృతురాలి ఫోన్‌ తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. నేరం తన మీద పడకుండా ఉండేందుకు మృతురాలి ఫోన్‌లోని సిమ్‌ తీసిపారవేశాడు. ఫోన్‌ను స్థానికంగా ఉన్న రైల్వేస్టేషన్‌ సమీపంలోని బడ్డీ షాప్‌ వద్ద పడేశాడు. ఈక్రమంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు, నిందితుడు తన ఫోన్‌ను తన ఇంట్లోనే పెట్టి ఉండటం అనుమానాలను తావిచ్చింది. సాంకేతిక అంశాల ఆధారంగా స్వర్ణకుమారిని హత్యచేసినది భవానీప్రసాద్‌గా గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. నిందితుడి వద్ద నుంచి బంగారు నానుతాడు, చాకు, రెండు ఫోన్‌లు, బైక్‌, ఫోన్‌ అడాప్టర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు భవానీప్రసాద్‌ను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న సీఐ మురళీకృష్ణ, ఎస్‌ఐలు సందీప్‌, తాతాచార్యులు, సురేష్‌, పోలీసు సిబ్బందిని ఈసందర్భంగా డీఎస్పీ శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement