
జంట హత్యల నిందితుడు అరెస్ట్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అద్దెకు ఉంటున్న గదిలో చోటు, డబ్బుల విషయంలో తలెత్తిన వివాదాల కారణంగానే ఇద్దరిని కత్తితో పొడిచి హత్య చేసినట్లు నిందితుడు జమ్ము కిషోర్ విచారణలో వెల్లడించినట్లు ఏసీపీ పావన్‌కుమార్ తెలిపారు. ఈనెల 16వ తేదీ గవర్నర్‌పేటలో జరిగిన జంట హత్యల కేసులో నిందితుడు జమ్ము కిషోర్‌ను గవర్నర్‌పేట పోలీసులు అరెస్ట్ చేశారు. గవర్నర్‌పేట స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ మాట్లాడుతూ... విజయవాడ వించిపేట నైజం గేటుకు చెందిన జమ్ము కిషోర్ భార్యతో గొడవ పడి కొంతకాలంగా ఆమెకు దూరంగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో రెండు నెలల కిందట రాము అనే కేటరింగ్ మేస్త్రి వద్ద ఉంటూ హోటళ్లలో పనిచేస్తున్నాడు. అతని వద్ద పనిచేసే వారికోసం రాము గవర్నర్‌పేటలో రూమ్ అద్దెకు తీసుకున్నాడు. ఆ రూమ్‌లో కిషోర్, నాగరాజుతోపాటు హత్యకు గురైన రాజు, వెంకట్ కలిసి ఉంటున్నారు. రూమ్‌లో చోటు, డబ్బు విషయంలో మద్యంమత్తులో వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో కిషోర్‌ను ఆ రూం నుంచి పంపించి వేయాలని రాజు, వెంకట్ నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కిషోర్ వారిని అడ్డు తొలగించుకోవాలని పథకం ప్రకారం వంట పనులకు వెళ్లిన సమయంలో తన వెంట కత్తి తెచ్చుకున్నాడు. ఈక్రమంలో 16వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో రాజు, వెంకట్ ఉండడాన్ని గమనించి వారితో ఉద్దేశపూర్వకంగా గొడవ పడ్డాడు. వారిని విచక్షణారహితంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. అడ్డు వచ్చిన నాగరాజు, బాషా అనే వారిని తోసేసి అక్కడి నుంచి పారిపోయి, రైలులో సికింద్రాబాద్ చేరాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం అధారంగా కిషోర్ సికింద్రాబాద్‌లో రైల్వే స్టేషన్‌లో ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. కత్తిని స్వాధీనం చేసుకున్నారు. కిషోర్‌పై ఇప్పటికే 8 కేసులు ఉన్నట్లు వివరించారు. కేసును చేధించిన సీఐ అడపా నాగమురళి, సిబ్బందిని ఏసీపీ అభినందించారు.