
నారాయణ పాఠశాలపై హక్కుల కమిషన్ ఆగ్రహం
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ప్రముఖ విద్యాసంస్థ నారాయణ పాఠశాలలో ఎటువంటి అనుమతులు లేకుండా నర్సరీ, ఎల్‌కేజీ, యుకేజీ తదితర తరగతులు నిర్వహిస్తుండటంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి ఇతర అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల విద్యాశాఖ, జిల్లా మహిళాభివృద్ధి శిశుసంరక్షణ శాఖ అధికారులతో కలిసి బత్తుల పద్మావతి శుక్రవారం విజయవాడ, పరిసర ప్రాంతాల్లోని పలు ప్రైవేట్ విద్యాసంస్థలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. భవానీపురంలోని నారాయణ విద్యాసంస్థలో తరగతులను పరిశీలించి అనుమతులపై ఆరా తీశారు. ఆయా తరగతులకు అనుమతులు లేకపోవడంతోపాటు పాఠశాలలో వెంటిలేషన్ సైతం సరిగా లేకపోవడాన్ని గుర్తించారు. నోటీసు బోర్డులో అవసరమైన సమాచారం లేకపోవడంతోపాటు బాలల రక్షణకు సంబంధించి నిబంధనలపై తీవ్రమైన లోపాలను గమనించారు. ఫిర్యాదుల బాక్స్ లేకపోవడం గుర్తించి నిర్వాహకులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిని సరిచేయకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తొలుత నోబుల్ కిడ్స్ పాఠశాలను పరిశీలించి ఆటస్థలం లేకపోవటం, మరుగుదొడ్లలో లోపాలు, రిజిస్టర్ల నిర్వహణపై అప్రమత్తత లేకపోవడం గుర్తించి అధికారులకు సూచనలు చేశారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌ను పరిశీలించి రెసిడెన్షియల్ హాస్టల్స్‌లో మార్గదర్శకాలు అమలులో ఉండాలే చూడాలని ఆదేశించారు. కేకేఆర్ గౌతమ్ పాఠశాలలో హాస్టల్‌ను పరిశీలించి సూచనలు చేశారు. ఇటీవల ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో నారాయణ కళాశాలను సందర్శించారు. విద్యార్థులతో ఆత్మీయంగా మాట్లాడి అక్కడి సమస్యలపై ఆరా తీశారు. నోటీసు బోర్డు ఏర్పాటు చేయాలని అక్కడి సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ఆయా అంశాలపై విద్యాసంస్థలకు నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు ఏ సూరిబాబు, బి.సోమశేఖర్‌నాయక్, బి.వెంకటేశ్వర్లు, ఆర్.విజయరామరావు, ఎం.విజయలక్ష్మి, నిర్మలారాణి, జీవీ వెంకటరమణ, బి.ప్రభాకర్‌రావు, మహిళాభివృద్ధి శిశుసంరక్షణశాఖ అధికారులు లక్ష్మీభార్గవి, ఈ.జోత్స్న తదితరులు పాల్గొన్నారు.