
డొక్కలు ఎండుతున్నాయ్ సీతమ్మా
కంకిపాడు: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం అందించి, వారి ఆకలి తీరుస్తున్న వంటకార్మికులు పస్తులతో సతమతమవుతున్నారు. నెలల తరబడి మధ్యాహ్న భోజనం బిల్లుల బకాయిలు పేరుకుపోతున్నాయి. మరో వైపు వేతనాలు కూడా పెండింగ్ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వంట ఏజెన్సీ కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారు. కృష్ణాజిల్లా వ్యాప్తంగా 1,349 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అన్ని ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలల్లో లక్ష మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. వారికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనపథకం కింద భోజనం అందిస్తున్నారు.
మూడు నెలల బిల్లుల పెండింగ్
మధ్యాహ్న భోజన పథకం అమలుపై దృష్టి సారించిన కూటమి సర్కారు ఆ పథకం నిర్వహించే ఏజెన్సీ కార్మికుల సంక్షేమాన్ని విస్మరించింది. గత విద్యాసంవత్సరంలో మార్చి, ఏప్రిల్ నెలల భోజన పథకం బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరంలో జూన్ నెల బిల్లులు కూడా అంద లేదు. జులైలో ఇప్పటికే పది రోజులు గడిచాయి. ప్రభుత్వం పెండింగ్ బిల్లుల ఊసెత్తటం లేదు. విద్యాశాఖ చెబుతున్న లెక్కల ప్రకారమే కృష్ణాజిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో మార్చి నెలకు సంబంధించి రూ.79.81 లక్షలు, ఏప్రిల్ నెలకు రూ.61.70 లక్షలు, జూన్ నెలకు రూ.55 లక్షలకుపైగా బిల్లులు విడుదల కావాల్సి ఉంది. ఈ బిల్లులు విడుదల కాకపోవటంతో ఏజెన్సీ కార్మికులు అప్పులు తెచ్చి మరీ ఏజెన్సీలను నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది. ప్రభుత్వం నుంచి చిక్కీ, గుడ్లు, బియ్యం, తాటి బెల్లం, రాగిపిండి అందిస్తోంది. వంటలకు అవసరమైన వస్తు సామగ్రి గ్యాస్, కూరగాయలు, వంట నూనెను కార్మికులే సమకూర్చుకుని విద్యార్థులకు సకాలంలో భోజనం అందిస్తున్నారు. నెలల తరబడి బిల్లులు పెండింగ్ పడుతున్నా, తమ అవస్థలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఏజెన్సీ కార్మికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. బిల్లులు చెల్లించకపోగా, వాటిలోనూ కోతలు విధిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. రూ.10 వేలకు బిల్లు పెడితే రూ.8 వేలు మాత్రమే ప్రభుత్వం మంజూరు చేస్తుండటంతో ఆర్థికంగా నష్టం జరుగుతోందని కొందరు మధ్యాహ్న భోజన పథకం కార్మికులు వాపోతున్నారు.
వేతనాలు కూడా పెండింగే
బిల్లులుతో పాటు వేతనాలు కూడా పెండింగ్‌లోనే పడుతున్నాయి. ఒక్కో కార్మికుడు/కార్మికురాలికి రూ.3 వేల వేతనం అందుతుంది. ఏప్రిల్ నెలకు సంబంధించి వెయ్యి రూపాయలు పెండింగ్ పడ్డాయి. జిల్లా వ్యాప్తంగా 2,255 మంది కార్మికులకు ఏప్రిల్ నెలకు రూ.22 లక్షల జీతాలు పెండింగ్‌లో ఉండగా, జూన్ నెలకు సంబంధించి రూ.67.50 లక్షలు అందాలి. బిల్లులకు తోడు జీతాలు కూడా పెండింగ్ పడటంతో కార్మికుల వెతలు వర్ణనాతీతంగా ఉన్నాయి.
కార్మికుల సంక్షేమానికి వైఎస్సార్ సీపీ కృషి
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం భోజన పథకం కార్మికుల సంక్షేమానికి కృషి చేసింది. జీతాలు, ఏజెన్సీ బిల్లులు ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ కార్మికుల అభ్యున్నతికి పాటుపడింది. విద్యా ర్థులకు రుచికరమైన భోజనం అందించటంలో నిరంతరం పర్యవేక్షణ చేసింది. ప్రస్తుతం పరిస్థితి భిన్నంగా మారటంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. పెండింగ్ బిల్లులు, జీతాల బకాయిలతో అష్టకష్టాలు పడాల్సి వస్తోందంటూ వాపోతున్నారు.
మధ్యాహ్న భోజన పథకం కార్మికుల ఆకలి మంటలు మూడునెలలుగా విడుదల కాని భోజన పథకం బిల్లులు కార్మికులకు వేతన బకాయిల చెల్లింపులోనూ తీవ్ర జాప్యం అవస్థలు పడుతూ విద్యార్థుల ఆకలి తీరుస్తున్న కార్మికులు
బిల్లులు, వేతనాలు చెల్లించాలి
మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీ కార్మికుల ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. నెలల తరబడి బిల్లులు పెండింగ్ పడుతున్నాయి. ప్రస్తుతం మూడు నెలల బిల్లులు అందాల్సి ఉంది. జీతాలు కూడా పెండింగ్ ఉన్నాయి. భోజన పథకాన్ని కార్మికులు సమర్థంగా నడుపుతున్నారు. పెండింగ్ బిల్లులు, జీతాల విడుదలపై పాలకులు, అధికారులు దృష్టి సారించాలి. అప్పుడే కార్మికులపై భారం తప్పుతుంది.
– తాడంకి నరేష్, సీఐటీయూ జిల్లా నేత