నిజామాబాద్‌ | - | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌

May 10 2026 8:22 AM | Updated on May 10 2026 8:22 AM

న్యూస్‌రీల్‌

వేసవి సెలవుల్లో విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా వివిధ నైపుణ్యాలను పెంపొందించే దిశగా జిల్లాలోని బాలభవన్‌ వేసవి ప్రత్యేక శిబిరాన్ని నిర్వహిస్తోంది. చిన్నారుల్లో సృజనకు పదును పెట్టేందుకు అద్భుత వేదికగా మారుతోంది. చిత్రలేఖనం, యోగా, కర్రసాము, భరతనాట్యం, లలిత సంగీతం, శ్లోకాలు, కథలు, మ్యాజిక్‌, స్కేటింగ్‌ తదితర వాటిల్లో చిన్నారులు సాధన చేస్తూ ప్రతిభకు పదును పెడుతున్నారు.

వాతావరణం

ఉదయం ఆహ్లాదకరమైన గాలులు వీస్తాయి. పగటి ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఉక్కపోతగా ఉంటుంది. రాత్రి నిర్మలంగా ఉంటుంది.

ఆదివారం శ్రీ 10 శ్రీ మే శ్రీ 2026

కంటికి రెప్పలా..

మోర్తాడ్‌(బాల్కొండ): ఒకరి సాయం అవసరమైన 88 ఏళ్ల వయస్సులో సాయమ్మ తన ఇద్దరు పిల్లలకు తానే సాయమవుతోంది. పేదరికం వెక్కిరిస్తున్నా.. మధ్య వయస్సుకు చేరిన పిల్లలు చంటి పిల్లల్లా తనపైనే ఆధారపడినా ఆ తల్లి ఎక్కడా ధైర్యాన్ని కోల్పోలేదు. ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్‌ గ్రామానికి చెందిన కమటం సాయమ్మ, రాములు దంపతులకు ఇద్దరు సంతానం రూప, భరత్‌. మానసిక ఎదుగుదల లేకపోవడంతో ఇద్దరు పిల్లలను కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చారు. సాయమ్మ వయస్సు ప్రస్తుతం 88 ఏళ్లు. భర్త 34 ఏళ్ల కిందటే మరణించాడు. భర్తను కోల్పోయిన సాయమ్మ పేదరికాన్ని ఎదిరిస్తూనే తన పిల్లలను సాకుతోంది. ప్రస్తుతం కూతురు రూపకు 56 ఏళ్లు, కొడుకు భరత్‌కు 54 ఏళ్లు. విధి ఆడిన వింత నాటకంలో పావుగా మారిన సాయమ్మ ఏ రోజూ తనకు జరిగిన నష్టం, అన్యాయంపై బాధపడలేదు. ఉపాధి కోసం బీడీలు చుడుతున్న సాయమ్మ వేకువ జామున లేచి కూతురు, కొడుకులను తయారు చేయడం, వారికి వంట చేసి పెట్టి కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూడకుండా తన రెక్కల కష్టాన్ని నమ్ముకున్న సాయమ్మ రోజుకు వెయ్యి బీడీల వరకు చుడుతుంది. సాయమ్మ జీవితాన్ని దగ్గర నుంచి చూసిన వారేవరైనా ఆమెకు రోజు శిరస్సు వంచి నమస్కరించాల్సిందే!

ముప్పై ఏళ్లుగా..

కామారెడ్డి పట్టణంలోని పంచముఖి హనుమాన్‌ కాలనీకి చెందిన సూరం సంతోష, వెంకటేశ్‌లది రెక్కాడితేకానీ డొక్కాడని కుటుంబం. వారికి 33 ఏళ్ల కూతురు అశ్విని, 31 ఏళ్ల కుమారుడు శ్రీనివాస్‌ ఉన్నారు. ఇద్దరూ మాట్లాడలేరు.. నడవలేరు. కనీసం నిలబడలేరు. 2010లో భర్త వెంకటేశ్‌ చనిపోవడంతో పిల్లల పూర్తి బాధ్యత సంతోషపైనే పడింది. పిల్లలే లోకంగా బతుకుతున్న సంతోష.. వారికి సేవలు చేస్తూ, ఇంట్లోనే బట్టలు అమ్ముతూ జీవనం సాగిస్తోంది. రోజూ పొద్దున్నే పిల్లలు బ్రష్‌, స్నానం చేయించి, ఏదైనా తినిపించి కూర్చోబెట్టాల్సిందే. కాలకృత్యాలకు తీసుకెళ్లి శుభ్రం చేయాలి. పిల్లలను వదిలి ఎటూ వెళ్లలేని పరిస్థితి. పిల్లలను కూర్చోబెట్టి బయట డోర్‌ లాక్‌ చేసి మార్కెట్‌కు వెళ్లొస్తుంటానని చెబుతోంది. పిల్లలకు సేవ చేస్తూ, వారిని చూసుకుంటూ బతుకుతున్నానని తెలిపింది.

కూతురికి అన్నీ తానై..

ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్‌ గ్రామాని కి చెందిన బోరంచ లక్ష్మి, దుర్గయ్య దంపతుల కు కూతురు రేణుక ఉంది. ఆమెకు పుట్టుకతోనే మతిస్థిమితం లేదు. రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబమైనా.. కన్న కూతురును 19 ఏళ్లుగా కంటికి రెప్పలా చూసుకుంటోంది అమ్మ. కూలినాలి చేసుకుంటూ బిడ్డకు అన్ని సపర్యలు చేస్తూ కాపాడుకుంటోంది.

– సాక్షి ప్రతినిధి, కామారెడ్డి

ఇప్పటికీ పసి పాపే..

కామారెడ్డి పట్టణంలోని అశోక్‌నగర్‌లో నివసించే బూక్య రజిత, రాజునాయక్‌లకు కూతురు, కొడుకు ఉన్నారు. బిడ్డ బూక్య లక్కీకి పుట్టుకతోనే ఆరోగ్య సమస్య ఉంది. ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. కదిలే స్థితిలోలేని బిడ్డను కంటిపాపలా చూసుకుంటున్నారు. రజితకు భర్త రాజునాయక్‌ ఆసరా అవుతారు. 16 ఏళ్లుగా సేవలు చేస్తున్నా ఏనాడూ భారంగా అనిపించలేదని చెబుతోంది రజిత. లక్కీని అందరూ ఎంతో ప్రేమగా చూస్తారని తెలిపింది. బిడ్డను చూసుకుంటూనే రజిత లా చదువుతోంది.

– 8లో..

Advertisement
 
Advertisement
Advertisement