● తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు వస్తేనే అభివృద్ధి సాధ్యం
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు
దినేశ్ పటేల్ కులాచారి
సుభాష్‌నగర్: ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి వస్తున్నారని, ఈ నెల 10న సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగే మోదీ బహిరంగ సభకు జిల్లా నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి కోరారు. ఈమేరకు గురువారం నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి తరహాలోనే తెలంగాణలో కూడా డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్నప్పుడే వేగవంతమైన అభివృద్ధి సాధ్యమని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక్కో డబుల్ బెడ్‌రూం ఇంటికి రూ.2.20 లక్షలు అందిస్తోందని తెలిపారు.
గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేంద్రం నేరుగా సర్పంచుల ఖాతాల్లో జమ చేస్తున్నా.. రాష్ట్రం తన ఖజానా ఖాళీ కావడంతో అక్రమంగా ఫ్రీజ్ చేసి నిధులు మళ్లిస్తోందని ఆరోపించారు. చారిత్రాత్మక మోదీ బహిరంగ సభకు జిల్లా నుంచి ఎంపీ అర్వింద్ ధర్మపురి ఆధ్వర్యంలో సుమారు 15 వేల మంది కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తరలివెళ్లనున్నట్లు తెలిపారు. సమావేశంలో నాయకులు పోతన్‌కర్ లక్ష్మీనారాయణ, నాగోళ్ల లక్ష్మీనారాయణ, న్యాలం రాజు, ప్రమోద్‌కుమార్, నాయిడి రాజన్న, బద్దం కిషన్, పుట్ట వీరేందర్, బిలోజీ నాయక్, అనంత్‌రెడ్డి, పడాల భూపతి, ఇప్పకాయల కిశోర్, యాదాల నరేశ్, ఆమంద్ విజయ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


