నిధులు లేక నిలిచిన సాయం | - | Sakshi
Sakshi News home page

నిధులు లేక నిలిచిన సాయం

May 7 2026 9:26 AM | Updated on May 7 2026 9:26 AM

మోర్తాడ్‌(బాల్కొండ): నిజామాబాద్‌ జిల్లా ఏర్గట్ల మండలం తొర్తికి చెందిన ఈర్గల్ల గంగాధర్‌ మార్చి 2025లో యూఏఈలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఎక్స్‌గ్రేషియా కోసం అతని భార్య లక్ష్మి అప్పట్లోనే రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. ఏడాది గడచినా ఇప్పటి వరకూ రూ.5 లక్షల సాయం అందలేదు. ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియాను విడుదల చేస్తే ఆ సొమ్ముతో తమ బాధలు తీరుతాయని లక్ష్మి భావించింది. ఏడాది కాలంగా సాయం కోసం ఆమె నిరీక్షిస్తూనే ఉంది. ఇది ఒక్క లక్ష్మికి ఎదురైన సమస్యే కాదు. ఎంతో మంది వలస కార్మికులు గల్ఫ్‌ దేశాల్లో మరణించగా వారి కుటుంబాలు రాష్ట్ర ప్రభుత్వం అందించే సాయం కోసం నిరీక్షిస్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలను స్వీకరించిన తరువాత గల్ఫ్‌ వలస కార్మికుల అంశంపై స్వయంగా పరిశీలన చేశారు. కారణం ఏదైనప్పటికీ గల్ఫ్‌ దేశాల్లో మరణించిన తెలంగాణ వలస కార్మికుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు. 2023 డిసెంబర్‌ తరువాత మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా 225 కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున సాయం అందించారు. ఏడాది కాలంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 130 మంది మరణించగా వారికి ఇప్పటి వరకూ సాయం అందలేదు. బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని గల్ఫ్‌ కార్మికుల సంఘాలు ప్రభుత్వాన్ని వేడుకున్నా ప్రయోజనం లేకపోయింది. వలస కార్మికులు గల్ఫ్‌ దేశాల్లో మరణిస్తే కుటుంబ సభ్యులు జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ద్వారా ప్రభుత్వానికి దరఖాస్తును అందించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ నిజామాబాద్‌ జిల్లాలో 17 కుటుంబాలకు, జగిత్యాల్‌ జిల్లాకు చెందిన 50 కుటుంబాలకు, కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, నిర్మల్‌ జిల్లాలకు చెందిన మరో 63 కుటుంబాలకు సాయం అందించాల్సి ఉంది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తే గల్ఫ్‌ మృతుల కుటుంబాలకు సాయం అందేది. ప్రభుత్వం నిధులను విడుదల చేయకపోవడంతో బాధిత కుటుంబాలకు నిరీక్షణ తప్పడం లేదు.

ప్రభుత్వానికి విన్నవించాం..

గల్ఫ్‌ దేశాల్లో మృతి చెందిన వలస కుటుంబాలకు సా యం కోసం నిధులు విడుదల చేయాలని ప్రభుత్వానికి విన్నవించాం. బడ్జెట్‌లో ప్ర త్యేకంగా నిధులను కేటా యించాలని కోరాం. ఎన్నో బాధిత కుటుంబాలు సాయం కోసం ఎదురు చూస్తున్నాయి. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైతేనే సాయం సొమ్ము ఖాతాల్లో జమ చేస్తారు. – స్వదేశ్‌ పరికిపండ్ల,

ఎన్నారై అడ్వయిజరీ బోర్డు సభ్యుడు

గల్ఫ్‌ దేశాల్లో మరణించిన వారికి

రూ. 5లక్షల ఎక్స్‌గ్రేషియాను

ప్రకటించిన ప్రభుత్వం

గతంలో 225 మందికి పంపిణీ

నిధులు లేక ఏడాది కాలంగా

సాయం కోసం 130 కుటుంబాల నిరీక్షణ

బడ్జెట్‌లో గల్ఫ్‌ సంక్షేమానికి నిధులు కోరినా పెడచెవిన పెట్టిన ప్రభుత్వం

Advertisement
 
Advertisement
Advertisement