సౌర విద్యుత్‌ ఉత్పత్తి | - | Sakshi
Sakshi News home page

సౌర విద్యుత్‌ ఉత్పత్తి

May 6 2026 7:43 AM | Updated on May 6 2026 7:43 AM

జక్రాన్‌పల్లిలో సోలార్‌ పవర్‌ ప్లాంట్‌

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: జిల్లాలో సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి దిశగా ఎన్‌పీడీసీఎల్‌ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా జక్రాన్‌పల్లిలో సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ను సంస్థ సీఎండీ వరుణ్‌రెడ్డి మంగళవారం ప్రారంభించగా, కోస్లిలో ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్‌ సబ్‌ స్టేషన్ల వద్ద సోలార్‌ పవర్‌ ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. భవిష్యత్తులో విద్యుత్‌ సమస్యను పూర్తిస్థాయిలో అధిగమించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్లాంట్ల నిర్మాణానికి అన్ని జిల్లాల్లో రంగం సిద్ధం చేసుకోవాలని ఇప్పటికే ఆయా విద్యుత్‌ పంపిణీ సంస్థలకు ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో ఎన్‌పీడీసీఎల్‌ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే మొదటిసారి జక్రాన్‌పల్లి విద్యుత్‌ ఉప కేంద్రం వద్ద సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ను ప్రారంభించారు. 3.5 ఎకరాల స్థలంలో 0.8 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్ధ్యంతో దీని నిర్మాణం చేపట్టారు. పైలట్‌ ప్రాజెక్టు కింద మొదటగా ఇక్కడ ప్లాంట్‌ను నిర్మాణం చేశారు. అయితే జిల్లాలోని నవీపేట మండలం కోస్లి విద్యుత్‌ ఉపకేంద్రం వద్ద సైతం మరో సోలార్‌ ప్లాంట్‌ను నిర్మాణం చేసేందుకు గాను అధికారులు ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపారు. కోస్లి వద్ద రెడ్‌కో ఆధ్వర్యంలో నిర్మాణం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఐదు ఎకరాల స్థలంలో ఒక మెగావాట్‌ విద్యుదుత్పత్తి సామర్ధ్యంతో నిర్మించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

భవిష్యత్‌లో జిల్లాలోని మరిన్ని సబ్‌ స్టేషన్ల వద్ద సోలార్‌ ప్లాంట్లను నిర్మించేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. 1మెగావాట్‌ సామర్ధ్యంతో సోలార్‌ ప్లాంట్‌ నిర్మించేందుకు 4 నుంచి 5 ఎకరాల మేర స్థలం అవసరం ఉంది. అయితే స్థలం సరిపడా లేని సబ్‌ స్టేషన్ల వద్ద ప్రభుత్వం స్థలం కేటాయించేందుకు ఆలోచన చేస్తోంది.

జిల్లాలో మొత్తం 273 విద్యుత్‌ సబ్‌స్టేషన్లు ఉన్నాయి. వీటిలో ఎక్కడెక్కడ సోలార్‌ ప్లాంట్లకు సరిపడా స్థలం ఉంది, ఇంకా ఎంత కావాలి అనే విషయమై అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సబ్‌ స్టేషన్లకు దూరంగా ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వం స్థలం కేటాయిస్తే అందుకు తగినవిధంగా ప్రణాళికలు తయారు చేస్తున్నారు. అయితే రెడ్‌కో ఆధ్వర్యంలో ఎక్కువ సోలార్‌ ప్లాంట్లు నిర్మాణం చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఆర్మూర్‌ మండలంలోని పెర్కిట్‌లో 200 గజాల స్థలంలో రెడ్‌కో ఆధ్వర్యంలో ఈవీ చార్జింగ్‌ స్టేషన్‌ను నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు ఎన్‌పీడీసీఎల్‌ ఎస్‌ఈ పీవీ రాజేశ్వర్‌రావు ‘సాక్షి’కి తెలిపారు.

రాష్ట్రంలోనే తొలి ప్లాంట్‌

పర్యావరణ పరిరక్షణకు ఇది ముందడుగు

ఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి

ఎన్‌పీడీసీఎల్‌ ఆధ్వర్యంలో జిల్లాలోని

సబ్‌స్టేషన్‌లలో సోలార్‌ ప్లాంట్లు

జక్రాన్‌పల్లిలో ప్రారంభం..

కోస్లిలో ఏర్పాటుకు ప్రతిపాదనలు

పెర్కిట్‌లో ఈవీ స్టేషన్‌ నిర్మాణానికి సైతం

Advertisement
 
Advertisement
Advertisement