నామినేటెడ్‌ పదవుల కోసం.. | - | Sakshi
Sakshi News home page

నామినేటెడ్‌ పదవుల కోసం..

May 6 2026 7:43 AM | Updated on May 6 2026 7:43 AM

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: నామినేటెడ్‌ పదవుల భర్తీ ప్రక్రియ నడుస్తుందన్న నేపథ్యంలో అవకాశాలు దక్కించుకునేందుకు జిల్లాకు చెందిన సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు తమ ప్రయత్నాలను మరోసారి ముమ్మరం చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మకాం వేసి కీలక నేతలను కలుస్తూ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు కచ్చితంగా అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు. రెండున్నరేళ్లుగా నామినేటెడ్‌ పదవుల కోసం ఎదురు చూస్తున్న నాయకులు ఇప్పుడు సాధించకపోతే తరువాత సాధించడం కష్టమని భావిస్తున్నారు. దీంతో నామినేటెడ్‌ చాన్స్‌ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం జిల్లాలోని ఆర్మూర్‌ నియోజకవర్గానికి చెందిన సీనియర్‌ నేత, ఉమ్మడి జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్‌ మార చంద్రమోహన్‌రెడ్డి ఆ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన నాయకులతో కలిసి 15 కార్లలో హైదరాబాద్‌ వెళ్లి పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌గౌడ్‌, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డిని కలిసి నామినేటెడ్‌ పదవి అవకాశం కల్పించాలని కోరారు. మార చంద్రమోహన్‌ వెంట కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వినయ్‌రెడ్డి, అన్ని మండలాల్లోని సర్పంచ్‌లు, మార్కెట్‌ కమిటీల చైర్మన్లు, వైస్‌చైర్మన్లు, డైరక్టర్లు, బ్లాక్‌, మండల పార్టీ అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, ఆర్మూర్‌ మున్సిపల్‌ కౌన్సిలర్లు, ఇతర సీనియర్‌ నాయకులు ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలో తనకు కచ్చితంగా రాష్ట్ర కార్పొరేషన్‌ పదవి వస్తుందనే ధీమాతో చంద్రమోహన్‌రెడ్డి ఉన్నారు.

● నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గానికి చెందిన సీనియర్‌ నేత బాడ్సి శేఖర్‌గౌడ్‌కు రాష్ట్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఖాయమైనట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్టు కోసం సైతం బీసీ కోటాలో శేఖర్‌గౌడ్‌ దరఖాస్తు చేసుకున్నారు. తరువాత డాక్టర్‌ భూపతిరెడ్డికి మద్దతుగా ఆయన గెలుపు కోసం కృషి చేశారు. శేఖర్‌గౌడ్‌కు రాష్ట్ర కార్పొరేషన్‌ పదవి కేటాయించే విషయంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌తో పాటు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్‌ భూపతిరెడ్డి సైతం పూర్తి దన్నుగా నలవడం గమనార్హం. దీంతో శేఖర్‌గౌడ్‌ పదవికి సంబంధించి రెండుమూడు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నట్లు తెలుస్తోంది.

బాడ్సి శేఖర్‌గౌడ్‌

ఎవరికి వారే గట్టి ప్రయత్నాలు చేస్తున్న అధికార పార్టీ సీనియర్లు

బాడ్సి శేఖర్‌గౌడ్‌కు

రాష్ట్ర కార్పొరేషన్‌ పదవి!

మార చంద్రమోహన్‌రెడ్డికి సైతం

కార్పొరేషన్‌ చాన్స్‌!

Advertisement
 
Advertisement
Advertisement